AP Seaplane Services : ఏపీలో 'సీప్లేన్' టూరిజం సేవలు - 30 నిమిషాల్లోనే శ్రీశైలం చేరొచ్చు..! ముఖ్యమైన 10 పాయింట్లు
Vijayawada - Srisailam Sea Plane Services: ఏపీ టూరిజం చరిత్రలో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఇయితే ఈ సీ ప్లేన్ సేవలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి…
సీప్లేన్ టూరిజం సేవలు
విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇకపై కృష్ణమ్మ అలలపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ లో భాగంగా… మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది. జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ సురక్షితంగా చేరుకుంది. ట్రయల్ రన్ విజయవంతం కావటంతో… అధికారికంగా ప్రారంభించటానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది.
ఏపీలో సీ ప్లేన్ సేవలు - ముఖ్యమైన పది పాయింట్లు..!
- ఏపీలోని విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 8వ తేదీన విజయవాడ - శ్రీశైలం మధ్య ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది.
- నవంబర్ 9వ తేదీన విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి “స్కై మీట్స్ సీ” పేరుతో సీ ప్లేన్ డెమో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
- విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఇవాళ(నవంబర్ 09) మధ్యాహ్నం 12:40కి విజయవాడ నుంచి సీ ప్లేన్ శ్రీశైలంకు బయల్దేరుతుంది. ఇందులో సీఎం చంద్రబాబు ప్రయాణిస్తారు.
- విజయవాడ నుంచి బయల్దేరే సీ ప్లేన్ 30 నుంచి 40 నిమిషాల వ్యవధిలోనే శ్రీశైలం చేరుకుంటుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసమే పది నిమిషాలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
- ఇవాళ బయల్దేరే సీ ప్లేన్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తారని అధికారులు తెలిపారు.
- సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కి.మీ దూరం ఉంటుంది. కానీ అతి తక్కువ సమయంలోనే శ్రీశైలం చేరుకుంటారు.
- ఇక టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిలోనే ఉండడం సీ ప్లేన్ల మరో ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
- ఈ ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి అవసరమైన అనుమతులు ముందుస్తుగానే అధికారులు తీసుకుంటారు.
- కేంద్ర పౌర విమానయానశాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. ఏపీలో ఈ తరహా సేవలు ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలోనే టూరిస్టులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ధరలు, టైమింగ్స్ పై కసరత్తు చేస్తోంది. ఈ బాధ్యతలను ఏపీ టూరిజం శాఖకు అప్పగించే అవకాశం ఉంది.
- విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వరకు మొదటి సీప్లేన్ సర్వీస్ యొక్క ట్రయల్ రన్ చూసేందుకు అనేక మంది పర్యాటకులు, స్థానికులు విజయవాడలోని పున్నమి ఘాట్‌కు తరలివచ్చారు. దేశంలో నాలుగేళ్ల క్రితమే గుజరాత్‌లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. అయితే ఎక్కువ కాలం ఈ సర్వీసులు నడపలేకపోయారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంబించేందుకు అక్కడి టూరిజం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.