Sea Plane : విజయవాడ టు శ్రీశైలం - ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ సక్సెస్, ఇదిగో వీడియో-vijayawada to srisailam sea plane trial run successful watch video here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sea Plane : విజయవాడ టు శ్రీశైలం - ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ సక్సెస్, ఇదిగో వీడియో

Sea Plane : విజయవాడ టు శ్రీశైలం - ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ సక్సెస్, ఇదిగో వీడియో

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 08, 2024 01:53 PM IST

Vijayawada to Srisailam Sea Plane: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది.

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్
విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇక కృష్ణమ్మ అలలపై దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. ట్రయల్ రన్ లో భాగంగా… మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఆ తర్వాత శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ సురక్షితంగా చేరుకుంది.

ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావటంతో రేపు(నవంబర్ 9, 2024) సీ ప్లేన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

అహ్మదాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే సీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి ట్రయల్ సర్వీసును శ్రీశైలం వరకు నిర్వహిస్తారు. డిహెచ్‌సి 6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 సేవల్ని దేశంలో లాంఛనంగా ప్రారంభిస్తారు.

దేశంలో నాలుగేళ్ల క్రితమే గుజరాత్‌లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని కేవడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. అయితే ఎక్కువ కాలం ఈ సర్వీసులు నడపలేకపోయారు. పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంబించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని ఎన్డీఏ 3 ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా అవి రకరకాల కారణాలతో మరుగున పడిపోయాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ బాధ్యతలు రామ్మోహన్ నాయుడు చేపట్టిన తర్వాత అందులో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ నుంచి కూడా సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు.

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఫ్లైట్ కనెక్టివిటీ పెంపొందించేందుకు సీ ప్లేన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ జరుగింది. 

Whats_app_banner