CBN in Seaplane : చంద్రబాబు కీలక నిర్ణయం.. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్‌లో ప్రయాణం
CBN in Seaplane : ఏపీ పర్యాటక శాఖ అద్బుతమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ నడపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా నడిపే సీ ప్లేన్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
ఈనెల 9న శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అదేరోజు విజయవాడలో సీ ప్లేన్‌ను ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌లోనే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు.
అయితే.. ప్రయోగాత్మకంగా రన్ చేయాలని మొదట అధికారులు భావించారు. ఆ తర్వాత మిగతా వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ.. అనూహ్యంగా చంద్రబాబు సీ ప్లేన్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సీ ప్లేన్ ప్రయాణంపై ఆసక్తి నెలకొంది. ఈనెల ఉదయం తన నివాసం నుంచి పున్నమి ఘాట్‌కు వచ్చి.. అక్కడ సీ ప్లేన్‌ను ప్రారంభించి.. దాంట్లోనే శ్రీశైలం వెళ్లనున్నారు.
ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్‌లో విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను సీఎం ప్రారంభిస్తారు. విజయవాడ- శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఉన్న అవకాశాలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే.. రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు.
కృష్ణా నదిలో పున్నమి ఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి పర్యాటక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్ బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. .శ్రీశైలం లోని పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీపై దిగేందుకు అధికారులు త్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నాయి.
బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవంతం అయ్యాక.. రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే.. ఏపీ పర్యాటక రంగానికి మంచి బూస్ట్ అవుతుందని అంటున్నారు.