Sajjala Ramakrishna Reddy : వైఎస్ సునీత మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు, ఇవాళ్టితో ఆమె ముసుగు తొలగిపోయింది - సజ్జల
Sajjala On YS Sunitha Reddy Comments: వైఎస్ సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వివేకాను చంపాల్సిన అవసరం టీడీపీ నేతలకే ఉందని…ఈ కేసుపై చంద్రబాబునే సునీత ప్రశ్నించాలని హితవు పలికారు.
Sajjala Ramakrishna Reddy: ఢిల్లీ వేదికగా వైఎస్ సునీతా రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందన్నారు. సునీత మాట్లాటం వెనక కుట్ర ఉందని తేలిపోయిందన్నారు. తలా తోకా లేకుండా ఏం మాట్లాడుతున్నారో సునీతకే తెలియాలన్నారు. వివేకా హత్యకు కుట్ర చేసే అవసరం మా ప్రత్యర్థులకే ఉందంటూ కామెంట్స్ చేశారు.
"వివేకాను చంపాల్సిన అవసరం టీడీపీ నేతలకే ఉంది. వివేకా కేసుపై చంద్రబాబునే సునీత ప్రశ్నించాలి నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. వివేకా కేసును ఎందుకు పరిష్కరించలేదు..? ఒక సీనియర్ నేతగా వివేకాను జగన్ గౌరవించారు. అసలు వివేకా ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఎవరు...? ఇదే చంద్రబాబు, బీటెక్ రవి కాదా...? అలాంటి వ్యక్తులు ఇవాళ స్నేహితులు అయ్యారు. సునీత ఇవాళ ముసుగు తీసేసింది.వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. వారి పాత్ర కూడా ఏమైనా ఉండొచ్చు. వీటన్నింటిపై కూడా విచారణ జరుగుతుంది. సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు" అని సజ్జల పేర్కొన్నారు.
సునీతా మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. సునీత వెనక ఎవరు ఉన్నారో ఇప్పుడు అందరికీ తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నవేళ సునీతా పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్లు అర్థమవుతుందన్నారు.
సునీతారెడ్డి కామెంట్స్…
YS Sunitha Reddy: ఇవాళ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు వైఎస్ సునీతా రెడ్డి. ఈ సందర్భంగా అధికార వైసీపీపై పలు విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పార్టీకి ప్రజలు ఓటేయ వద్దని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. తాను వ్యవస్థను నమ్ముతున్నానని, తాను చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రజల సహకారం నాకు కావాలన్నారు. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన తన తండ్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితుల్ని సిఎం జగన్ కాపాడుతున్నారని సునీత ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు, జగన్ పార్టీకి ఓటు వేయోద్దన్నారు. జగన్ విలువలు విశ్వసనీయత అనే మాటలు పదేపదే చెబుతుంటారని, అవన్నీ వివేకానందరెడ్డి విషయంలో ఎందుకు జగన్‌కు గుర్తు రావడం లేదని నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. తండ్రి హత్య కేసు దర్యాప్తుపై జగన్ తనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరిగితే, ఇంకా చాలామందికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. విశాఖలో కోవిడ్ సమయంలో ప్రశ్నించిన డాక్టర్‌కు ఏమైందని, ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎవరు ఎందుకు పోరాడటం లేదని, ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం లేదని, ఆ నమ్మకాన్ని కలిగించడానికి తాను పోరాడుతున్నానని సునీత చెప్పారు. ఈ పోరాటంలో ప్రజల సహకారం కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పునివ్వాలన్నారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పిన విజయసాయిరెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత గుండెపోటుగా కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. కర్నూలులో అవినాష్‌ను ప్రశ్నించడానికి వెళితే కనీసం కలవనివ్వకుండా సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే వరకు ఆపారని సునీత ఆరోపించారు. హంతకులు మన మధ్యే ఉంటారని.. కానీ గుర్తించలేమనివైఎస్ సునీతా ఆరోపించారు.