PM Vishwakarma : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్, ఉచితంగా కుట్టుమిషన్లు- దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు-pm vishwakarma free sewing machine programme to women application process started ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Vishwakarma : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్, ఉచితంగా కుట్టుమిషన్లు- దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు

PM Vishwakarma : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్, ఉచితంగా కుట్టుమిషన్లు- దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2024 03:29 PM IST

PM Vishwakarma sewing machine : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా వివిధ వృత్తుల వారికి పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఆర్థికసాయం, రుణాలు అందిస్తుంది కేంద్రం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తున్నారు. తాజాగా ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది.

మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్, ఉచితంగా కుట్టుమిషన్లు- దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు
మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్, ఉచితంగా కుట్టుమిషన్లు- దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు

PM Vishwakarma sewing machine : మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ...సంక్షేమ పథకాలపై దృష్టిపెడుతుంది. ఇటీవల బడ్జెట్ లో సైతం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ఎన్డీఏ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీఏ-2లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుకు కార్యాచరణ చేపట్టింది. లోక్ సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల కోడ్ తో అప్పట్లో అప్లికేషన్లు స్వీకరించినా ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా వీటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వకర్మ లోన్ల మంజూరు కార్యాచరణ చేపట్టింది. వివిధ వృత్తుల వారికి యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది.

ఉచితంగా కుట్టు మిషన్లు

మహిళలకు కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ పథకంలో ఆర్థికసాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ .15000 అందిస్తారు. ఈ నగదును లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం జమచేస్తుంది. దీంతో పాటు ఒక వారం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తారు. కుట్టుమిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి రూ.లక్ష రుణం అందిస్తారు. ఈ లోన్ ను 18 నెలల్లో తిరిగి చెలిస్తే, మరో రూ .2 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దానిని 30 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కుట్టు మిషన్ కొనుక్కునే వారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం లోన్ ఇస్తుంది.

వెరిఫికేషన్

గతంలో కుట్టుమిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికి తిరిగి వెరిఫై చేస్తున్నారు. కుట్టుమిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు ఎక్కడ నేర్చుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారా? గతంలో లోన్లు తీసుకున్నారా? అనే వివరాలు సేకరిస్తున్నారు.

దరఖాస్తు విధానం

ఉచిత కుట్టుమిషన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్లు భారతీయులై ఉండాలి. ఇప్పటికే కుట్టుపనిలో అనుభవం కలిగి ఉండాలి. వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, అడ్రస్ వివరాలు, గుర్తింపు కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు బ్యాంకు పాస్ బుక్, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.

ముందుగా https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియకపోతే దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ పూర్తైన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ట్రైనింగ్ కు పిలుస్తారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తుంది. ఆ నగదుతో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయవచ్చు. అనంతరం బ్యాంక్ మీకు లోన్ సదుపాయం కల్పిస్తుంది. అతి తక్కువ వడ్డీకి రూ.3 లక్షల వరకు పీఎం విశ్వకర్మ పథకంలో లోన్ పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం