AP Paddy procurement : అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు - 48 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు
రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని చెప్పారు.
ఖరీప్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులతో శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్… ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తామని..... ప్రతీ రైతుకీ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు.
ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భేటీ:
ఏఐఐబీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రోడ్డ నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు వరదలకు కొట్టుకుపోకుండా ఆధునాతన పరిజ్ఞానం ఉపయోగించి పక్కాగా వేయాలన్నారు. రోడ్ల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, ఎక్కువ కాలం నిలిచిపోయేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ప్రతిసారీ రోడ్లు పాడవకుండా నిబంధనల ప్రకారం పటిష్టంగా రోడ్లు వేసేలా కాంట్రాక్టర్లకు స్పష్టమైన నియమావళిని ఇవ్వాలని సూచించారు. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా, ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా రాష్ట్రంలో రహదారులు లేని గ్రామాలు లేకుండా సమగ్రంగా ప్రాజెక్టు రూపకల్పన చేయాలన్నారు. పనులు వేగంగా, పకడ్భందీగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రాజెక్టు అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై, రహదారుల అనుసంధానంపై డిప్యూటీ సిఎం మార్గదర్శకంలో ప్రాజెక్టు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుముడిలంక గ్రామంలో పర్యటించి అక్కడ రోడ్డుతో పాటు ఓ వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఆధునాతన సాంకేతికత ఉపయోగించుకొని ఆ రోడ్డు అనుసంధానంపై డ్రోన్ తో సర్వే నిర్వహించినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. సాంకేతికత సాయంతో ప్రాజెక్టు మరింత శరవేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మారిన అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.