AP HC On Arjita Seva Tickets : శ్రీవారి భక్తులకు చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనమే చేసుకోవాలన్న హైకోర్టు
AP HC On TTD Arjita Seva Tickets : కొవిడ్ సమయంలో ఆర్జిత సేవ టికెట్ల తీసుకుని దర్శనం చేసుకోలేని కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. టీటీడీ కల్పించిన సదుపాయాలనే ఉపయోగించుకోవాలని పిటిషన్లు వేసిన భక్తులకు స్పష్టం చేసింది.
AP HC On TTD Arjita Seva Tickets : కోవిడ్-19 సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రస్తుతం అవకాశం కల్పించాలని హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఆ సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న మిగిలిన భక్తులకు కల్పించిన సదుపాయలనే ఉపయోగించుకోవాలని పిటిషనర్లను ఆదేశించింది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేల్ చాట్ వస్త్రం, అభిషేకం సహా ఇతర ఆర్జిత సేవలను కూడా రద్దు చేసింది. ఆర్జిత సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు టికెట్ సొమ్ము వెనక్కు తీసుకోవడమో, లేదా టీటీడీ కల్పించే దర్శనం సదుపాయం ఉపయోగించుకునే వీలు కల్పించింది.
ఈ రకంగా సుమారు 16 వేల మంది భక్తులు ఆర్జిత సేవలో పాల్గొనలేక పోయారు. కొందరు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోగా, మరి కొందరు ఆర్జిత సేవ టికెట్ మొత్తం వెనక్కు తీసుకున్నారు. అయితే 16 మంది భక్తులు తమకు ఆర్జిత సేవలో పాల్గొనేలా టీటీడీ ని ఆదేశించాలని హై కోర్టును ఆశ్రయించారు. కోవిడ్ 19 ప్రమాదం ముగిసినందువల్ల పిటిషనర్లకు వారు బుక్ చేసుకున్న ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిపై టీటీడీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. భక్తులు ముందే ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నందువల్ల పిటిషనర్లకు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించలేమని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ డివిజన్ బెంచ్ కు వివరించారు. ఈ వివరణతో ఏకీభవించిన న్యాయమూర్తులు… టీటీడీ ఇచ్చిన రెండు సదుపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేసింది.