NIA Searches : తెలుగు రాష్ట్రాల్లో పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు
NIA Searches: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
NIA Searches: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. సోమవారం తెల్లవారక ముందే స్థానిక పోలీసుల సహకారంతో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు నివాసంలో సోదాలు చేపట్టారు. పొన్నూరులో ప్రజావైద్యశాల నిర్వహిస్తున్న రాజారావు ఇంట్లో సోదాలు చేయడం కలకలం రేపింది.
నెల్లూరు జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు ఇంట్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది సురేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. న్యాయవాది సురేష్‌తో పాటు అతని బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో సోదాలు చేపట్టారు.
హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నాయకురాలు భవానీ నివాసంలో సోదాలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిరవ్హిస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూల పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళంలో కులనిర్మూలన పోరాట మిస్కా కృష్ణయ్య నివాసంలో సోదాలు చేపట్టారు. నెల్లూరులో పౌర హక్కుల సంఘం నాయకులు అరుణ, వెంకటేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్‍పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఏపీ సిఎల్‌సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో ఎన్ఐఏ దాడులు చేయడం కలకలం రేపింది.
రెండు దశాబ్దాలుగా అణగారిన వర్గాల పక్షాన నిలబడి పౌర హక్కుల ఉద్యమంలో ఎల్లంకి వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అనేక ఉద్యమాల్లో భాగస్వాములుగా వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తూ పౌర హక్కుల ప్రజలను నిరంతరం చైతన్యం చేయడంలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ముందు వరుసలో ఉన్నారు. ప్రజా గొంతుకుని వినిపించడంలో హక్కుల గురించి మాట్లాడడంలో ముందున్న ఎల్లంకి వెంకటేశ్వర్లపై గత కొంతకాలంగా ఎన్ఐఎ టీం నిఘా ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టింది. ఎన్‌ఐఏ సోదాలను పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులు ఖండించారు.
విజయవాడలో కూడా ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ శివార్లలోని పినైనవరం గ్రామంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాధ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. విజయవాడ చిట్టినగర్‌లో అడ్వకేట్ అరసవిల్లి కృష్ణ, పూర్ణనందం పేటలో అడ్వకేట్ ఆంజనేయులు నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి, అవసరమైతే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.