Visakhapatnam : క్రూయిజ్ షిప్ ఆకారంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్.. ఎన్ని ఎకరాల్లో తెలుసా?-multi level car parking in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Multi Level Car Parking In Visakhapatnam

Visakhapatnam : క్రూయిజ్ షిప్ ఆకారంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్.. ఎన్ని ఎకరాల్లో తెలుసా?

Anand Sai HT Telugu
Aug 22, 2022 07:09 PM IST

మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎప్పుడైనా చూశారా? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకైతే లేదు. కానీ అతిత్వరలో రాబోతోంది. అది కూడా సాగరతీరం విశాఖ నగరంలోనే.

నమూనా చిత్రం
నమూనా చిత్రం

విశాఖలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ రానుంది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ప్రణాళికల ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే 2023 మే నాటికి వైజాగ్‌లో భారీ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (MLCP) కమర్షియల్ కాంప్లెక్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

సిరిపురంలో 1.72 ఎకరాల విస్తీర్ణంలో MLCP నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం 80 కోట్లు. సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ కంపెనీల కార్యాలయాల వంటి వాణిజ్య సంస్థలకు స్థలం కాకుండా 450 కార్లు, 600 ప్లస్ ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.

సిరిపురం MLCP.. VMRDA చిల్డ్రన్స్ ఎరీనా, VMRDA కార్యాలయం, HPCL యాజమాన్యంలోని మిలీనియం పెట్రోల్ బంక్, ఆంధ్రా యూనివర్సిటీ, WNS గ్లోబల్ సర్వీసెస్ (HSBC పాత కార్యాలయం) సమీపంలో 11 అంతస్తుల నిర్మాణం అవుతుంది. 450 కార్లు, 600 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ కోసం మెుత్తం ఐదు అంతస్తులతో నిర్మితమవుతుంది. అండర్ గ్రౌండ్ మూడు ఫ్లోర్లు, పైన రెండు ఫ్లోర్లు పార్కింగ్ కోసం కేటాయిస్తారు.

'కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న 18 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రణాళిక చేశాం. ఈ ప్రాజెక్ట్ 2021 డిసెంబర్‌లో ఖరారు అయింది. దాదాపు 20 శాతం పనులు పూర్తయ్యాయి. మే 2023 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్మాణం క్రూయిజ్ షిప్ లాంటిది. ఐటీ కంపెనీల వంటి వాణిజ్య మరియు కార్పొరేట్ కార్యాలయాలకు ఇది బాగా సరిపోతుంది. అన్ని పార్కింగ్ స్లాట్‌లు ఆక్రమిస్తే.. నెలవారీ ఆదాయం దాదాపు రూ. 60 లక్షలుగా వస్తుంది.' అని VMRDA సూపరింటెండింగ్ ఇంజినీర్ ఇంచార్జి M. బలరామరాజు చెప్పారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన విశాఖ కలెక్టర్ ఎ.మల్లికార్జున పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు మరింత మంది కార్మికులను తీసుకురావాలని తెలిపారు. పండుగలు, వివాహాలు, ఆఫీస్ లకు ప్రొగ్సామ్స్ ఉన్నప్పుడు.. ట్రాఫిక్ కష్టాల విపరీతంగా ఉంటాయి. ఈ క్రమంలో MLCP ప్రాముఖ్యతను సంతరించుకుంది. 5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో సమీపంలోని WNS కంపెనీ దసరా తర్వాత తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఇలాంటి వాటితో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

IPL_Entry_Point