Minister RK Roja : రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ నువ్వే... చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
Minister RK Roja Latest News: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Minister RK Roja Fires On Chandrababau: ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా. శనవారం తాడేపల్లిలో పలువురు మంత్రులతో కలిసి మాట్లాడిన ఆమె… టీడీపీ, జనసేన పార్టీలపై మండిపడ్డారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై మెగా సర్వే చేపట్టాలంటే దమ్ము ఉండాలన్నారు. అంత దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకునేందుకు ఈ మెగా సర్వే చేపట్టారని అన్నారు. ఇవాళ్టి వరకు 63 లక్షలకు ఇళ్లకు మెగా సర్వే చేరిందన్నారు.
జగన్మోన్ రెడ్డి పాలనను ప్రజలంతా ఆమోదిస్తున్నారని మంత్రి రోజా చెప్పారు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారని… మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకు వెళ్లేలా చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇవాళ జగనన్నే మా భవిష్యత్ అని అంటున్నారని వ్యాఖ్యానించారు. "ధైర్యంగా సీఎం జగన్ మెగా పీపుల్స్ సర్వే చేపట్టారు. భారీ ఎత్తున మిస్డ్ కాల్స్ ఇస్తూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. నిజానికి ఈ సర్వే రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సంచలనం. గతంలో ఇలాంటి సర్వే ఎక్కడ కూడా జరగలేదు. ప్రతి ప్రభుత్వ పథకం ప్రజల ఇంటి వద్దకే వెళ్తోంది. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని జగన్ అమలు చేస్తున్నారు" అని చెప్పారు.
"ప్రతి ఇంటి మీద జగనన్న స్టిక్కర్లు చూసి చంద్రబాబుకు భయం మొదలైపోయిది. ఇవాళ సూటిగా పవన్ , చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా. పోటీగా స్టిక్కర్లు వేయటం ద్వారా మీకు ప్రజా మద్దతు రాదు. ఇవాళ చంద్రబాబు సెల్ఫీలు దిగుతున్నారు. చంద్రబాబు దిగుతున్నది సెల్ఫీ కాదు... సెల్ఫ్ గోల్. నీచ రాజకీయాలు చేస్తున్నావ్. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉచితంగా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే బహిరంగ చర్చకు రా. నగరిలోనైనా సరే... కుప్పంలోనైనా సరే మీ మెనిఫెస్టో తీసుకొని రా. మా ఎన్నికల మెనిఫెస్టోను తీసుకొని వస్తా. ఎవరెన్ని హామీలు అమలు చేశారనే దానిపై చర్చిద్దాం. అప్పుడు సెల్ఫీలు ఎవరుతో దిగుతారో తెలుస్తోంది. చంద్రబాబు… ఫేక్ సెల్ఫీలు దిగి మురిసి పోవటం కాదు. నువ్వు ఒక ఫెయిల్యూర్ పొలిటిషియన్ వి. ప్రజలంతా జగన్ వెంట ఉన్నారు. ప్రజా మద్దతు సర్వేలో జగన్ ను ఆశీర్వదిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా మరోసారి వైసీపీనే గెలుస్తుంది. ప్రజలను ప్రేమతో గెలవాలి. కానీ పచ్చ ఛానళ్లతో గెలవలేరు. రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ నువ్వే " అంటూ చంద్రబాబుపై రోజా మండిపడ్డారు.