Lokesh with Satya Nadella: ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకరించాలని సత్య నాదెళ్లకు లోకేష్ విజ్ఞప్తి
Lokesh with Satya Nadella: ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు.
Lokesh with Satya Nadella: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఎఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు.
కృత్రిమ మేధ (ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో లోతైన ఆసక్తి కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. లోకేష్ తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ... మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఎఐ -డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.
ఐటి హబ్ లకు సహకారం అందించండి
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా రూపుదిద్దుకున్న విషయం మీకు తెలుసని లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన బాబు ఎపిని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని వివరించారు.
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నాం.
ఐటి టాలెంట్ పై దృష్టి సారించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యుత్తమ ఐటి, ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారుచేసే బలమైన విద్యావ్యవస్థను కలిగి ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐటి నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. ఎపిలో ఐటి, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక. ఆగ్రిటెక్ కు ఎఐని అనుసంధానించడం వల్ల మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు వివరించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎపిలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్ లకు అనువుగా ఉంటాయి. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
ఎఐ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దుతాం
క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాం లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నామని నారా లోకేష్ వివరించారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నామని ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.
ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించాలని సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సిఇఓను కోరారు. ఏపిలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్... ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు.
శంతను నారాయణ్ మాట్లాడుతూ... అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్-ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది. ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చాం. సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ-పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.17.95 లక్షలకోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉందని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం. ఎపిలో ఇ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించాలని కోరారు. .