Jagananna Vidya Deevena : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపే అకౌంట్లలో నగదు జమ-kovvur cm jagan to release funds jagananna vidya deevena scheme money to students ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kovvur Cm Jagan To Release Funds Jagananna Vidya Deevena Scheme Money To Students

Jagananna Vidya Deevena : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపే అకౌంట్లలో నగదు జమ

Bandaru Satyaprasad HT Telugu
May 23, 2023 07:13 PM IST

Jagananna Vidya Deevena : విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

Jagananna Vidya Deevena : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం జగన్... బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఇప్పుటికే సీఎం జగన్‌ కొవ్వూరు పర్యటన రెండు సార్లు వాయిదా పడింది. బుధవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు సీఎం జగన్. కొవ్వూరు సత్యవతినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి రేపు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనతో రేపు కొవ్వూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజమండ్రి- కొవ్వూరు మధ్య వాహనాలను గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు

పేద పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20 వేలు, ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు ఖాతాల్లో జమ చేస్తుంది. విద్యార్థులు కళాశాలలకు కట్టే ఫీజులను మూడు నెలలకొకసారి విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేస్తుంది.

రేపటి సభకు ఏర్పాట్లు

కొవ్వూరులో సీఎం జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు రాకపోకల విషయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జిల్లా కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు 2.1 కిలోమీటర్లు వరకు సీఎం జగన్ రోడ్‌షో లో నిర్వహించనున్నారు. దీంతో భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. రోడ్ షో మార్గాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద మెడికల్‌ క్యాంపులు, తాగునీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.. సీఎం జగన్ కొవ్వూరు పర్యటన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. గత నెల 14న సీఎం కొవ్వూరు రావాల్సి ఉంది. సీఎం రోడ్‌షో, బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాలతో ఈ పర్యటన వాయిదా వేశారు. ఈ నెల 5న కొవ్వూరులో సీఎం పర్యటన ఉంటుందని అధికారులు ఏర్పాట్లు చేయగా, అకాల వర్షాలతో పర్యటన వాయిదా పడింది. మొత్తానికి రేపు(బుధవారం) సీఎం పర్యటన ఖరారైంది.

IPL_Entry_Point