KGBV Students: తరగతులకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించిన కేజీబీవీ స్పెషలాఫీసర్
KGBV Students: అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం కొత్తూరు గ్రామంలోని కస్తూర్బగాంధీ బాలిక విద్యాలయంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేసి తరగతులకు ఆలస్యంగా వెళ్లారని స్పెషలాఫీసర్ విద్యార్థినుల జుట్టు కత్తిరించడంపై కలకలం రేగింది.
KGBV Students: అల్లూరి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. జి మాడుగల మండలం కొత్తూరు కస్సూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్ విద్యార్థినుల జట్టును స్పెషలాఫీసర్ కత్తిరించడంపై కలకలం రేపింది. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విద్యార్థినులు హాస్టల్లో తలస్నానాలు చేసి ఆలస్యంగా తరగతులకు వెళ్లారు. విద్యార్థినులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహించిన కేజీబీవీ స్పెషలాఫీసర్ వారిని ఎండలో నిలబడాలని ఆదేశించారు. అంతటితో ఊరుకోకుండా భోజన విరామంలో 18మంది జుట్టు కత్తిరించారు.
నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజు జీ మాడుగుల మండలంలోని కొత్తూరులో ఉన్న కేజీబీవీలో స్నానాలకు నీరు అందుబాటులో లేదు. విద్యార్థినులు తలస్నానాలు చేయడం ఆలస్యం కావడంతో బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థినులు ఆలస్యంగా వెళ్లినట్టు చెబుతున్నారు. మరికొందరు హాజరు కాలేదు. మొత్తం 23మంది విద్యార్థినులు క్లాసులకు రాలేదని తెలియడంతో కేజీబీవీ ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న ఆగ్రహంతో ఊగిపోయారు.
హాస్టల్లో ఉన్న కొందరు విద్యార్థినులపై చేయి చేసుకున్నారు. క్లాసులకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినులను ఎండలో నిలబడాలని ఆదేశించారు. భోజన విరామ సమయంలో తలస్నానాల పేరుతో తరగతులు ఎగ్గొడుతున్నారని ఆరోపిస్తూ 18మంది జుట్టు కత్తిరించారు. ఈ ఘటనను విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నవంబర్ 15న అసెంబ్లీ జరిగే సమయానికి విద్యార్థినులు రాలేదని ఆరోపిస్తూ జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం ఇంటర్ విద్యార్థినుల జుట్టును కత్తిరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో రోజూ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ సెకండియర్ విద్యార్థినులు అలస్యంగా రావడంతో స్పెషలాఫీసర్‌గా ఉన్న ప్రిన్సిపల్ సాయప్రసన్న ఆగ్రహం వ్యక్తంచ చేశారు. కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అంతటితో కోపం చల్లారని ప్రిన్సిపల్ తలస్నానాల పేరుతో ఆలస్యంగా వస్తున్నారంటూ 18మంది జుట్టు కత్తిరించేశారు.
విద్యార్థినులు వద్దని వేడుకున్నా బలవంతంగా కత్తిరించినట్టు ఆరోపిస్తున్నారు. కొందరు దేవుడి మొక్కు ఉందని చెప్పినా కనికరించలేదని చెబుతున్నారు. విద్యార్థినుల జుట్టు కత్తిరించడంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ ఇచ్చారు. విద్యార్థినుల జుట్టు బాగా పెరిగిపోవడంతో పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే కట్ చేసినట్లు తెలిపారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. మరోవైపు ఈ ఘటన తమ దృష్టికి వచ్చిదని ఎంఈవో బాబూరావు తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాలికల జుట్టు కత్తిరించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.