Kadapa Accident : కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి సీరియస్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని ఆదేశం
Kadapa Accident : కడపలో కరెంట్ షాక్ తో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి సీరియస్ అయ్యారు. కడప ఘటనపై అధికారులను వివరణ కోరారు. కేబుల్ ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ వైర్ తెగిపడిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
Kadapa Accident : కడపలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని వివరించాలని మంత్రి కోరగా... స్పందించిన అధికారులు ఈ ఘటనకు స్థానిక కేబుల్ ఆపరేటర్ కారణం అని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్ లాగడానికి ప్రయత్నించిన తరుణంలో విద్యుత్ తీగ కిందపడినట్లు తెలిపారు. కేబుల్ ఆపరేటర్ ముందస్తు సమాచారం అందించి ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. అయితే తీగ తెగిపడిన సమయంలోనే దురదృష్టవశాత్తు పిల్లలు అదే దారి వెంబడి రావడంతో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి కోరారు. ముఖ్యంగా తీగలు వేలాడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి వాటికి మరమత్తులు చేయాలని చెప్పారు. కడప ఘటన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి... ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం తనను కలిచి వేసిందని అన్నారు. ప్రమాదం జరిగాక పరిహారం ఇవ్వడం కంటే.. ఘటనలు జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కడపలో విషాదం
కడపలో ఘోర ప్రమాదం జరిగింది. నగర పరిధిలోని అగాడి వీధిలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్ నుంచి సైకిల్ పై మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
విద్యార్థి మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
కడప అగాడి వీధిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్(11) అనే చిన్నారి మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం