Jogi Ramesh and Rajeev: మంగళగిరి పోలీసుల విచారణకు జోగి రమేష్, కోర్టు విచారణకు రాజీవ్
Jogi Ramesh and Rajeev: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి చిక్కులు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో అరెస్టైన జోగి తనయుడు రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలో విచారణ జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసుల విచారణకు జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Jogi Ramesh and Rajeev: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి చిక్కులు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉండగా చేసిన పనులకు ప్రతిపక్షంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్టైన జోగి తనయుడు రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ 12వ అదనపు కోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసుల విచారణకు జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
మూడేళ్ల క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసుల విచారణకు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ హాజరయ్యారు. ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా జోగి రమేశ్ పలు కారణాలతో గైర్హాజరయ్యారు. తాజాగా మంగళగిరిలోని డిఎస్పీ కార్యాలయంలో విచారణకు న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు.వైసీపీ అధికారంలో ఉండగా 2022లో ఉండవల్లిలో బాబు ఇంటిపై దాడికి జోగి రమేష్ నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. అప్పట్లో ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
చంద్రబాబు నివాసంపై దాడి చేయడానికి ప్రయత్నించారనే అభియోగాలపై జోగి రమేష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి డిఎస్పీ రవికాంత్ ఎదుట విచారణకు జోగి హాజరయ్యారు.
ఈ కేసులో జోగికి ఇప్పటికే మూడుసార్లు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.అయితే వేర్వేరు కారణాలతో వాయిదా వేశారు. తన న్యాయవాదులతో కలిసి జోగి రమేష్ విచారణకు వచ్చారు. పోలీసుల విచారణకు ముందు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటిపై తాము దాడి చేయలేదని జోగి రమేశ్ చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలియచేయడానికే తాము చంద్రబాబు ఇంటికి వెళ్లినట్టు జోగి రమేశ్ చెప్పారు. డిఎస్సీ రవికాంత్ ఆధ్వర్యంలో విచారణలో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.
అగ్రిగోల్డ్ కేసులో…
విజయవాడ రూరల్ మండలంలోని అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో అరెస్టైన జోగి రమేష్ తనయుడి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ 12వ అదనపు కోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ పీపీ జ్యోతి వాదనలు వినిపించారు. జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్లు న్యాయమూర్తి భాస్కరరావు ఎదుట వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో సాయంత్రం 4గంటల్లోగా రిప్లై వేయాలని ఏసీబీని న్యాయమూర్తి ఆదేశించారు.