Jagan On CBN: ప్రజల్ని మోసం చేయడానికే చంద్రబాబు పవన్ పొత్తులన్న జగన్-jagan said that chandrababu pawan is making alliances to deceive people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan On Cbn: ప్రజల్ని మోసం చేయడానికే చంద్రబాబు పవన్ పొత్తులన్న జగన్

Jagan On CBN: ప్రజల్ని మోసం చేయడానికే చంద్రబాబు పవన్ పొత్తులన్న జగన్

Sarath Chandra HT Telugu
Nov 15, 2023 01:38 PM IST

Jagan On CBN: ప్రజల్ని వెన్నుపోటు పొడవడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ మళ్లీ పొత్తులు పెట్టుకుంటున్నారని, 2014లో బాబు హామీలకు పూచీ అని చెప్పిన పవన్ తర్వాత ఎక్కడకు పోయాడని జగన్ ప్రశ్నించారు.

మాచర్ల సభలో మాట్లాడుతున్న సిఎం జగన్
మాచర్ల సభలో మాట్లాడుతున్న సిఎం జగన్

Jagan On CBN:ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని, ఒకరు చెబితే నమ్మరని, చంద్రబాబు ఇంకొకరిని కలుపుకుని కేజీ బంగారం ఇస్తాము, బెంజి కారు ఇస్తాము అంటూ ఐదు హామీలు ఒకరు, మరో ఆరు హామీలు దత్తపుత్రుడు కలిపి 11హామీలిస్తున్నారని సిఎం జగన్ ఎద్దేవా చేశారు.

2014లో దత్తపుత్రుడు… చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫెస్టోకు తాను పూచీ అని చెప్పి, వీరిద్దరు అయితే సరిపోరని, మోదీని కూడా కలుపుకుని ప్రజల్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అలాంటి గత చరిత్ర ఉన్న వారు ఐదు హామీలు, ఆరు హామీలతో ఇంకొకరు అంటున్నారని, వాళ్లు మనుషులేనా, సిగ్గుందా అని ప్రశ్నించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండేళ్లు కోవిడ్ సమస్యలు వచ్చాయని, కోవిడ్ వచ్చినా.. చంద్రబాబు చేసిన అప్పులు ఇబ్బంది పెట్టినా ఎవరి మీద నేరం మోపకుండా, సాకులు చెప్పకుండా, ప్రజల అవసరాలు, ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల కంటే ఎక్కువగా భావించి చెల్లించినట్టు చెప్పారు. ఎలాంటి కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధి ఆపలేదన్నారు.

ప్రతిపక్షం, చంద్రబాబు గత పాలనలను ప్రజలు గమనించాలన్నారు. రాబోయే మహా సంగ్రామంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని, గత పాలన ఎలా జరిగింది, ఆ పాలనలో ఆ పాలకులు ఎలా పనిచేశారు, మంచి చేశారో లేదో ఆలోచన చేయాలన్నారు. గత పాలనకు, తన పాలనకు మధ్య బేరీజు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ అమలు చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.

చంద్రబాబుది మోసాల చరిత్ర…

గతంలో చంద్రబాబు పాలనలో మోసాల చరిత్ర, వెన్నుపోటు చరిత్ర, అబద్దాల చరిత్రను మాత్రమే చూశామన్నారు. చంద్రబాబు 14ఏళ్లు సిఎంగా ఉన్నా కనీసం ఒక మంచి చేశామని, ఒక మంచి స్కీము తీసుకొచ్చామని, ఒక్క మంచి కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పలేదన్నారు.

ఎన్నికలు రాగానే మాయ మాటలతో ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తారన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే ఓటు వేయాలని తాను కోరుతున్నానని, 14ఏళ్లు సిఎంగా ఉండి ఫలానా మంచి చేశాను కాబట్టి ఓట్లు అడగకుండా, మోసం చేయడానికి, ప్రజల్ని వెన్నుపోటు పొడవడానికి కేజీ బంగారం ఇస్తాను, బెంజి కారు కొనిస్తానని మోసం చేస్తాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో కూడా నీరు ఇచ్చిన చరిత్ర లేదని, కుప్పానికే నీరు ఇవ్వలేని చంద్రబాబు మిగతా ప్రాంతాలకు ఏమి చేస్తాడన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారం కొనిస్తాను అన్నట్టు చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు.

సొంత కుటుంబంలో సొంత కూతురిని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు రాష్ట్రంలో కోటి 50లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా అని జగన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో మారాను అని చెబితే నమ్మగలమా అన్నారు. ఎన్టీరామారావు పరిస్థితి అదే అయితే మనలాంటి వారి పరిస్థితి ఏమిటని సిఎం జగన్ ప్రశ్నించారు.

ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తామంటాడు, ముస్లింలకు ఓ మంత్రి పదవి కూడా ఇవ్వని వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా న్యాయం చేశారా అని నిలదీశారు. భవిష్యత్తులో నేను మారాను అంటే నమ్మగలమా అన్నారు.

వాళ్ల పిల్లలకే ఇంగ్లీష్ మీడియమా…

చంద్రబాబు కొడుకు, మనుమడు కూడా ఇంగ్లీష్ మీడియంకు వెళ్తారిని, బాబు కొడుక్కి కనీసం తెలుగు మాట్లాడటం రాదని, ఇంగ్లీష్‌ కూడా రాదని, తన కొడుకు మనుమడిని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడని, వారిని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకునే పెత్తందారి మనస్తత్వం అన్నారు.

గవర్నమెంట్ బడుల్లో పేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేదలు చదివే బడుల్లో మాత్రం తెలుగు మీడియం మాత్రమే ఉండాలని, ఇంగ్లీష్ మీడియంకు మారితే తెలుగు ఏమవుతుందని బాధపడతాడని, అలాంటి పెద్ద మనిషి హయంలో ఏ పేదవాడికైనా, సామాన్యుడికైనా భవిష్యత్తు మారుతుందనే నమ్మకం ఉందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు భవిష్యత్తులో మీ దగ్గరకు వచ్చి మారానని చెబితే ఎలా నమ్మగలం అన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే రెండు వేల నిరుద్యోగ భృతి, జాబురావాలంటే బాబు రావాలి అని మోసం చేసిన పెద్ద మనిషి అని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే, దానికి మరో రెండు లక్షల 7వేల ఉద్యోగాలను కొత్తగా కల్పించామన్నారు. ఇన్ని కొత్త ఉద్యోగాలను చంద్రబాబును నమ్ముకుంటే ఇవ్వగలరా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో బాబు మారాను అని చెబితే ఎవరైనా నమ్మగలరా అన్నారు.

చంద్రబాబుకు గద్దె దిగకపోతే ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీ ఉండేది కాదని, అన్ని అమ్మెసే వాడన్నారు. ఆర్టీసీ, ఆస్పత్రులు, విద్యుత్ సంస్థలు మిగిలేవి కాదన్నారు. చంద్రబాబు దిగిపోవడం వల్ల హాస్పటల్స్ రూపురేఖలు మారాయని, ఆర్టీసీ రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.

హైదరాబాద్‌లో చికిత్స…

చంద్రబాబుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా హైదరాబాద్‌ వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడని, వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం విప్లవాన్ని తీసుకురావాలని ఎప్పుడైనా అడుగులు వేశాడా అని ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతాడని ఎప్పుడైనా భరోసా ఇచ్చాడా అని జగన్ ప్రశ్నించారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పాడని, విద్యుత్ కోసం ధర్నాలు చేస్తే రైతుల గుండెల మీద కాల్చాడని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఏనాడైనా నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు.

రైతుల్ని మోసం చేసిన బాబు రైతులకు హామీలిస్తున్నారని, రైతులకు 87వేల కోట్ల రుణమాఫీ చేస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మోసం చేశాడన్నారు.

మోసం చేసిన వారిని సమర్ధించేందుకు ఓ వర్గం ఉందని, చంద్రబాబును సమర్ధించేందుకు ఓ వర్గం, మీడియా, దొంగల ముఠా తోడుగా ఉందని, వీరంతా పెద్ద లాబీ, బాబు దోపిడీలపై విచారణ జరగకుండా వ్యవస్థల్ని మ్యానేజ్ చేయడానికి మనుషులు ఉన్నారని, అనేక పార్టీలో కోవర్టులు ఉన్నారని, వీళ్లంతా మన కళ్లెదుట కనిపిస్తారని, ఇలాంటి వారిని చూసినపుడు వీరంతా ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని, ఏ పేదల కోసం రాజకీయాలు చేస్తున్నారని, వీళ్లు రాజకీయాలు చేసేది ప్రజల్ని దోచుకోవడానికి, దోచుకునేది పంచుకోవడం కోసమే దొంగల ముఠాగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

పొత్తుల రాజకీయాలు చేతకాదు…

ఇలాంటి రాజకీయాలు, పొత్తులు తమకు చేతకాదని, వైఎస్సార్‌, జగన్‌లకు ప్రజల్లో నడవడం, ప్రజల గుండె చప్పుడు వినడం మాత్రమే తెలుసన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని మాత్రమే జగన్ చెబుతాడని, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావించి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రతిక్షణం తపిస్తూ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. పొత్తులు నమ్ముకోలేదని, ఎవరు అండగా లేకున్నా ప్రజల ఆశీస్సులు, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని దళారులు అవసరం లేదన్నారు. చేసిన మంచిని మాత్రమే నమ్ముతానని చెప్పారు.

నేరుగా ప్రజలకు పంచిన రూ.2.40లక్షల కోట్ల రుపాయలు తన ధైర్యమన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, 99శాతం అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్లి, చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినట్టు నిజాయితీగా చెప్పే చిత్తశుద్ధి, ధైర్యం తమకు ఉందన్నారు. మాచర్లలో 100పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మాచర్ల ఆస్పత్రిగా మారుస్తున్నట్లు చెప్పారు. మిగిలిన చిన్నా చితక పనులు స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు.

Whats_app_banner