Ys Jagan Protest: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్, జంతర్‌మంతర్‌లో ఆందోళన, అఖిలేష్ యాదవ్ మద్దతు
Ys Jagan Protest: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45రోజుల్లో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వైసీపీ శ్రేణులపై దాడుల్ని నిరసిస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జగన్ నిరసన చేపట్టారు.
Ys Jagan Protest: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులేనన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో ఆరోపించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, గత 45 రోజులుగా అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోంది. అంతులేని దారుణాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం. వైయస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో నెలన్నరలో 30 మందికి పైగా హత్యలు జరిగాయని, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని, 560 చోట్లకు పైగా ప్రైవేటు ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ప్రైవేటు ఆస్తులను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేశారు. చివరకు తోటలు కూడా విధ్వంసం చేస్తున్నారున్నారు.
చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టారని, ఎవరెవరి మీద దాడుల చేయాలి, ఎవరిని ఎలా వేధించాలో అన్ని వివరాలు అందులో రాసినట్టు లోకేష్ స్వయంగా ప్రకటించారన్నారు.
రాష్ట్ర పోలీసులకు కూడా లోకేష్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని తమ పార్టీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా.. ఏ చర్యా తీసుకోవద్దని నిర్దేశించారని ఆరోపించారు. రెడ్‌బుక్‌ను రాష్ట్రమంతటా హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించడమే కాకుండా, దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాడన్నారు. ఏపీలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగం పని చేస్తోందని జగన్ ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదని, హత్యలు చేయలేదని, దాడులు చేయలేదని, ఆస్తుల విధ్వంసం చేయలేదన్నారు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదని, వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసంపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశామని చెప్పారు.
వైసీపీ నిరసనకు సంఘీభావం తెలిపిన అఖిలేష్ యాదవ్…
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరై మద్దతు తెలిపారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక చర్యలను అఖిలేష్ ఖండించారు. తనను ఆహ్వానించినందుకు జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆహ్వానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యహింస గురించి తనకు తెలిసేది కాదన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకే టీడీపీ చర్యలు ఉన్నాయని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తరవాత, అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని హితవు పలికారు. ప్రజల సమస్యలు పట్టించుకోవాలని, ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైందన్నారు. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
నిన్నటి వరకు జగన్ సీఎంగా ఉన్నారని ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, రేపు మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావొచ్చన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించ లేదని దాన్ని తప్పు పడుతున్నాంమన్నారు. ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారన్నారు. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. ప్రజలు సంతోషంగా జీవించాలన్నారు.
ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో.. వారు మంచి ముఖ్యమంత్రి కారని అది సుపరిపాలన, మంచి ప్రభుత్వం కాదన్నారు. ఆ పని చేసే వాళ్లు ఎక్కువ కాలం అధికారంలో ఉండరన్నారు. బుల్డోజర్ సంస్కృతి అనేది ఎప్పుడూ, ఎక్కడా మంచిది కాదని, యూపీలో దాన్ని చూశాం. వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మా యూపీలో చూశామన్నారు.
ఫేక్ ఎన్‌కౌంటర్ కూడా ఏకంగా పోలీస్ కస్టడీలోనే జరిగిందన్నారు. ఎవరైనా పోలీస్ కస్టడీ సురక్షితం అనుకుంటారు. కానీ, మా దగ్గర ఏకంగా పోలీస్ కస్టడీలోనే ఎన్‌కౌంటర్ చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, అదే పరిస్థితి మా యూపీలో కూడా చూశామన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా ప్రభుత్వంతో పోరాడామని, ప్రభుత్వం ముందు తల వంచలేదన్నారు. ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు , కాంగ్రెస్ నుంచి కూడా ఆరుగురిని గెలిపించామన్నారు. ప్రజల వెంట ఉన్నవారిని, వారు ఎప్పుడైనా ఆదరిస్తారన్నారు.