Inter Student Suicide: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
Inter Student Suicide: ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి నిరాకరించాడని ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య ఘటన సిద్ధిపేటలో జరిగింది.
Inter Student Suicide: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి నిరాకరించాడని ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని దండుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దండుపల్లి గ్రామానికి చెందిన కాస రమేష్,ముత్యాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు . కాగా చిన్న కూతురు హరిత (17) గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కాగా గజ్వేల్ మండలం బండ్ల వెంకటాపూర్ గ్రామానికి చెందిన స్వామితో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది . దీంతో కొద్ది రోజులుగా హరిత,స్వామి ప్రేమించుకుంటున్నారు.
ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని....
శనివారం కళాశాలకు వెళ్ళి,సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన యువతి ప్రేమ విషయం తల్లితో చెప్పింది. నేను స్వామి అనే యువకుడిని ప్రేమించానని, అతనినే పెళ్లి చేసుకుంటానని, తాను కాదంటే చనిపోతానని చెప్పింది. ఆ తర్వాత స్వామితో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోమని అడగగా అతడు నిరాకరించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఆదివారం తల్లితండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా తల్లితండ్రులు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి హరిత ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
స్వామి పెళ్ళికి నిరాకరించడంతో తమ కూతురు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి కాస రమేష్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కూతురు మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
చెరువులో దూకి ఆత్మహత్య…
మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవ పడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే మెదక్ జిల్లా చేగుంటకు చెందిన తిరుపతి,సాయికుమార్ (21) స్నేహితులతో కలిసి మద్యం తాగడానికి వెళ్లారు.
కాగా మద్యం తాగే క్రమంలో సాయి కుమార్ స్నేహితులతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో తన స్నేహితుడు తిరుపతి గాయపడ్డాడు. దీంతో మిగిలిన స్నేహితులు తనను ఏమైనా చేస్తారేమోనని భయంతో పరుగున వెళ్లి స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు . మృతుడు సాయికుమార్ తల్లితండ్రులు గతంలోనే మరణించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)