Prakasam District : మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషం.. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించిన వ్య‌క్తి.. కుమార్తె మృతి-in prakasam district the daughter died after a man locked his wife and daughter in the room ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam District : మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషం.. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించిన వ్య‌క్తి.. కుమార్తె మృతి

Prakasam District : మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషం.. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించిన వ్య‌క్తి.. కుమార్తె మృతి

HT Telugu Desk HT Telugu
Oct 12, 2024 09:15 AM IST

Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో దారుణం జరిగింది. మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషంగా వ్య‌వ‌హ‌రించాడు ఓ దుర్మార్గుడు. క‌న్న కూతురిని తండ్రే పొట్ట‌న పెట్టుకున్నాడు. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించాడు. దీంతో అనారోగ్యంగా ఉన్న ప‌సికందు చికిత్స అంద‌క‌పోవ‌డంతో.. ప్రాణాలు విడిచింది.

ప్ర‌కాశం జిల్లాలో దారుణం
ప్ర‌కాశం జిల్లాలో దారుణం (HT)

ప్ర‌కాశం జిల్లా సింగ‌రాయ‌కొండ‌లో అమానుష ఘ‌ట‌న జరిగింది. స్థానిక పోలీసులు, నాయ‌కుల ఒత్తిడి కార‌ణంగా ఆల‌స్యంగా శుక్ర‌వారం బ‌య‌ట‌ప‌డింది. ఆడ‌బిడ్డ‌గా పుట్ట‌డ‌మే ఆ చిన్నారి చేసిన పాపం అయింది. అనారోగ్యం పాలై చికిత్స అంద‌క పుట్టిన రెండు నెల‌ల‌కే ప్రాణాలు విడిచింది. కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన తండ్రి, నాన్న‌మ్మ‌, తాత‌య్య క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో బందీగా మారి బ‌లైపోయింది.

సింగ‌రాయ‌కొండ‌లోని డ్రైవ‌రుపేట‌కు చెందిన షేక్ సందానీబాషాకు, పాకల‌కు చెందిన షేక్ ర‌షీదాతో రెండేళ్ల క్రితం షాదీ (పెళ్లి) జ‌రిగింది. ఏడాది త‌రువాత వీరికి మొద‌టి సంతానంగా ఆడ‌బిడ్డ పుట్టింది. అప్ప‌టి నుంచి భ‌ర్త‌, అత్త‌మామ‌లు ర‌షీదాను వేధించ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలోనే ర‌షీదా మ‌ళ్లీ గ‌ర్భం దాల్చింది. ఈ ఏడాది జులై 31న ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ర‌షీదా మ‌రో పండంటి ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో భ‌ర్త, అత్త‌మామ‌ల వేధింపులు తార‌స్థాయికి చేరాయి.

పుట్టినబిడ్డ రెండు నెల‌ల కింద‌ట అనారోగ్యం పాలైంది. స్థానిక వైద్యులు ప‌రీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లాల‌ని సూచించారు. భ‌ర్త‌, అత్త‌మామ‌లు ఆ ప‌సికందుకు వైద్యం అందించేందుకు నిరాక‌రించారు. అంతేకాదు ఇంటివ‌ద్ద‌నే ఓ గ‌దిలో త‌ల్లి, కుమార్తెల‌ను బంధించి అమానుషంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో సెప్టెంబ‌ర్ 26న ఆ పసికందు చ‌నిపోయింది.

భ‌ర్త‌, అత్త‌మామ‌ల నుంచి త‌ప్పించుకుని బాధితురాలు అక్టోబ‌ర్ 3న పోలీసులను ఆశ్ర‌యించింది. భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌పై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు అక్టోబ‌ర్ 5న భ‌ర్త సందానీ బాషా, మామ మెహ‌బూబ్‌బాషా, అత్త సుల్తానీబీల‌ను అరెస్టు చేశారు. అయితే.. ఈ విష‌యాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఆ నోటా, ఈ నోటా చ‌ర్చ జ‌రిగిన త‌రువాత‌.. శుక్ర‌వారం సీఐ హ‌జ‌ర‌త్త‌య్య మీడియాకు ఘ‌ట‌న‌ గురించి వివ‌రించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner