Jana Sena chief Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం మలుపు తిరిగింది. పవన్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.... విచారించేందుకు జీవో ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. అన్నింటికీ సిద్ధపడే ప్రజల ముందు నిజాలు బయటపెట్టానని స్పష్టం చేశారు. అవసరమైతే అరెస్టు చేసుకోవచ్చని... చిత్రహింసలు కూడా పెట్టుకోండంటూ సవాల్ విసిరారు. జగన్... ఎన్ని విచారణలైనా చేస్కో… జైలుకెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
"ఏపీ అభివృద్ధే నా లక్ష్యం. నేను జైలుకెళ్లడానికైనా సిద్ధమే. జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే సిద్ధంగానే ఉన్నా. మీరు మర్డర్ చేసే వ్యక్తులకు మద్దతుగా ఉన్నారు. నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాను. వాలంటీర్లకు అతి తక్కువ జీతాలు ఇస్తున్నావ్ అని అన్నాను. ప్రజలకు సంబంధించిన కీలకమైన డేటాను సేకరించటాన్ని ప్రశ్నించాను. డేటాను సేకరించి ఏం చేస్తోంది? ఎవరికి ఇస్తోంది? అని నిలదీశాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి.. నాకు నోటీసులు పంపితే భయపడిపోయే వ్యక్తిని నేను కాదు. ఇకపై మీ అక్రమ మైనింగ్, దోపీడీ విధానాలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. వాలంటీర్లు చేసే తప్పులకు సీఎం బాధ్యత తీసుకుంటారా?" అని పవన్ కల్యాణ్ గట్టిగా ప్రశ్నించారు.
"నేను చాలా బలంగా చెబుతున్నాను. జగన్... మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. మీరు సేకరిస్తున్న వివరాలు డేటా చౌర్యం కిందికి వస్తుంది. మీరు చేసేది డేటా చౌర్యమని చెబుతున్నాను. వ్యక్తిగత డేటాను సేకరించే హక్కు మీకు లేదు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పోరాడుతాం. సై అంటే సై... నేను రెడీ, తేల్చుకుద్దాం. యువతను మోసం చేసిన జగన్ సర్కార్ పై పోరాడుతాం. జనం బాగుండాలంటే జగన్ పోవాలి" అని పవన్ కల్యాణ్ అన్నారు.
గ్రామ, వార్డు వలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది ఏపీ సర్కార్. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్పెషల్ సీఎస్‌అజయ్ జైన్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పవన్ కల్యాణ్ పై చర్యలకు సిద్ధమైంది సర్కార్. వలంటీర్లపై ఉద్దేశపూర్యకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేసింది. మహిళా వలంటీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
సంబంధిత కథనం