Chandrababu Pawan Meeting : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ-కీలక అంశాలపై చర్చ!
Chandrababu Pawan Meeting : టీడీపీ అధినేత చంద్రబాబును, పవన్ కల్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్, చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించారు.
Chandrababu Pawan Meeting : టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం పరామర్శించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి నాదెండ్ల మనోహర్‌తో కలిసి వెళ్లిన పవన్ కల్యాణ్... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబు అక్టోబరు 31న రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబుకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని తెలుస్తోంది. చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ భేటీలో ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు తెలుస్తోంది.
లోకేశ్ -పవన్ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్, నాదెండ్ల మనోహర్ శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి పరామర్శిచారు. పవన్, నాదెండ్ల మనోహర్‌లకు నారా లోకేశ్ స్వాగతం పలికారు. చంద్రబాబును పరామర్శించిన అనంతరం రాజకీయాలపై చర్చించారు. దాదాపుగా 45 నిమిషాల పాటు నారా లోకేష్, పవన్ భేటీ జరిగినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ఈ భేటీ చర్చించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ!
టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన అనంతరం ఇరు పార్టీల నేతలు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల రాజమండ్రిలో జనసేన, టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. తాజా భేటీలో రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాలు వంటి అంశాలపై చర్చించారని తెలుస్తోంది. భవిష్యతు రాజకీయాలపై ఇరు పార్టీల నేతల చర్చించినట్లు సమాచారం.