AP RGUKT Admissions: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో సీట్ల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు, జులై 11న జాబితా విడుదల-heavy applications for ap triple it seats select list released on july 11 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rgukt Admissions: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో సీట్ల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు, జులై 11న జాబితా విడుదల

AP RGUKT Admissions: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో సీట్ల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు, జులై 11న జాబితా విడుదల

HT Telugu Desk HT Telugu
Jun 27, 2024 10:03 AM IST

AP RGUKT Admissions: రాష్ట్రంలోని రాజ‌వ్‌గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాల‌జీ యూనివ‌ర్శిటీ (ఆర్‌జీయూకేటీ) ప‌రిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిష‌న్ల కోసం భారీగా ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. గ‌తేడాది కంటే దాదాపు ప‌ది వేలు ద‌ర‌ఖాస్తులు పెరిగాయి.

జూలై 11న విడుదల కానున్న ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల జాబితా
జూలై 11న విడుదల కానున్న ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల జాబితా

AP RGUKT Admissions: ఏపీలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్ధుల జాబితాల జూలై 11న విడుదల కానుంది. గ‌తేడాది 40 వేలు దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఏకంగా 53,863 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. రాష్ట్రంలోని శ్రీ‌కాకుళం, ఇడుపుల‌పాయ‌, ఒంగోలు, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిష‌న్లు జ‌రుగుతున్నాయ‌ని, ఈనెల 25తో ద‌ర‌ఖాస్తు చేసేందుకు గ‌డువు ముగిసింద‌ని అడ్మిష‌న్ల క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఎస్ఎస్ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు.

ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,000 సీట్లు చొప్పున మొత్తం నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కోటా కింద మ‌రో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సీట్ల‌కు 53,863 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు దాదాపు 13 మంది పోటీ ప‌డుతున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారిలో ప్ర‌భుత్వ స్కూల్స్ నుంచి 34,154 మంది, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 19,671 మంది విద్యార్థులు ఉన్నారు.

అందులో 23,006 మంది బాలురు కాగా, 30,857 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులు 50,132 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, తెలంగాణ విద్యార్థులు 3,693 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను మిన‌హాయించి ఇత‌ర రాష్ట్రాల విద్యార్థులు 38 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అందులో ప్ర‌త్యేక కేట‌గిరీల్లో సైనికోద్యోగుల పిల్లలు 3,495 మంది, ఎన్‌సీసీ కేట‌గిరీలో 2,129 మంది, స్ఫోర్ట్స్ కోటాలో 1,389 మంది, దివ్యాంగు కేట‌గిరీలో 381, స్కౌట్స్ అండ్ గైడ్ కోటాలో 327 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల్లో ఆంధ్రా యూనివ‌ర్శిటీ పరిధిలో 28,573 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ ప‌రిధిలో 21,559 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

సీట్లు ఎలా కేటాయిస్తారు?

ప‌దో త‌ర‌గ‌తిలో అత్య‌ధిక మార్కులు సాధించిన వారికి, రిజ‌ర్వేష‌న్ల‌ను అనుస‌రించి సీట్ల‌కు కేటాయిస్తారు. అయితే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివిన విద్యార్థుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. నాన్ రెసిడెన్షియ‌ల్ ప్ర‌భుత్వ పాఠ‌శాలు, జిల్లా ప‌రిష‌త్ హైస్కూళ్లు, మున్సిప‌ల్ హైస్కూళ్ల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన విద్యార్థుల‌కు 4 శాతం డిప్రెవేష‌న్ స్కోర్‌ను జోడించి సీటు కేటాయిస్తారు.

ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప‌ద్ధ‌తిలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ సీట్ల‌ను ఏపీ, తెలంగాణ విద్యార్థుల‌కు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ఇందులో ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనున‌క‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు 100 సీట్లు కేటాయిస్తారు. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు 25 శాతం సూప‌ర్ న్యూమ‌రీ సీట్లు అందుబాటులో ఉంటాయి.

రిజ‌ర్వేష‌న్లు అమలు ఎలా?

ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను ఇలా అమ‌లు చేస్తారు. ఎస్‌సీల‌కు 15 శాతం, ఎస్‌టీల‌కు 6 శాతం, బీసీల‌కు 29 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తారు. బీసీల్లో 29 శాతంలో కూడా బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశారు. అలాగే దివ్యాంగుల‌కు 5 శాతం, సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థుల‌కు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్ల‌ను కేటాయిస్తారు. అలాగే ప్ర‌తి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్ల‌ను బాలిక‌ల‌కు కేటాయిస్తారు.

జూలై 1 నుంచి కేటగిరీల‌ వారీగా స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్‌

ట్రిపుల్ ఐటీల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌త్యేక కేట‌గిరీ అభ్య‌ర్థులకు జూలై 1 నుంచి స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌త్యేక కేట‌గిరీల వారీగా ఈ స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ ఉంటుంది. సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు జూలై 1 నుంచి 3 వ‌ర‌కు స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ ఉంటుంది. స్ఫోర్ట్స్ కోటా అభ్యర్థుల‌కు జూలై 3 నుంచి 6 వ‌ర‌కు ఉంటుంది. విక‌లాంగుల కోటా అభ్య‌ర్థుల‌కు జూలై 3న‌, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్య‌ర్థుల‌కు జూలై 2,3 తేదీల్లో స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ జ‌రుగుతుంది. ఎన్‌సీసీ కోటా అభ్య‌ర్థుల‌కు జూలై 3 నుంచి 5 వ‌ర‌కు స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ నిర్వ‌హిస్తారు.

జూలై 11 ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా

జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్ర‌క‌టిస్తారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 22, 23 తేదీల్లో ఎంపికైన అభ్య‌ర్థుల స‌ర్టిఫికేట్ల‌ను ప‌రిశీలిస్తారు. ఒంగోల్ ట్రిపుల్ ఐటీలో 24, 25 తేదీల్లోనూ, శ్రీ‌కాకుళం ట్రిపుల్ ఐటీలో 26, 27 తేదీల్లో ఎంపికైన అభ్య‌ర్థుల స‌ర్టిఫికేట్లు ప‌రిశీలించి, అడ్మిష‌న్లు చేయ‌నున్నారు.

ట్రిపుల్ ఐటీల్లో కోర్సులు

పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ క‌లిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్య‌సించ‌వ‌చ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సుల‌తో స‌మానంగా మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్ సైన్స్ ప్ర‌త్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, సివిల్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ బ్రాంచ్‌లు ఉంటాయి.

ట్రిపుల్ ఐటీల్లో ఫీజులు ఇలా ఎలా?

ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థుల‌కు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూష‌న్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు ఉంటుంది. బీటెక్ విద్య‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.50 వేలు ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.1.50 ల‌క్ష‌లు ఉంటుంది. అద‌నంగా హాస్ట‌ల్ ఫీజులు ఉంటాయి.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel