AP Floods: వ్యాపారుల చేతివాటం...అర లీట‌ర్ పాలు రూ.80... బోటులో తరలించేందుకు వేల‌ల్లో వ‌సూలు-half a litre of milk costs rupees 80 collecting thousand of rupees for transportation in boats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Floods: వ్యాపారుల చేతివాటం...అర లీట‌ర్ పాలు రూ.80... బోటులో తరలించేందుకు వేల‌ల్లో వ‌సూలు

AP Floods: వ్యాపారుల చేతివాటం...అర లీట‌ర్ పాలు రూ.80... బోటులో తరలించేందుకు వేల‌ల్లో వ‌సూలు

HT Telugu Desk HT Telugu
Sep 03, 2024 02:05 PM IST

AP Floods: విజ‌య‌వాడ‌లో సింగ్‌న‌గ‌ర్ మొద‌లుకొని చాలా ప్రాంతాల్లో ముంపుకు గుర‌య్యాయి. ప్ర‌జ‌లు తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ముంపుతో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తాగు నీరు కూడా లేకుండా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇదే అవకాశంగా పాల ధరలు పెంచేశారు.

భారీ వర్షాలు.. వరదలతో 19 మంది మృతి
భారీ వర్షాలు.. వరదలతో 19 మంది మృతి

ప్ర‌భుత్వం అందించే ఆహార పదార్థాలు కూడా ముందుగా ఉండే కాండ్రిక, పాయ‌క‌పురం వంటి ప్రాంతాల వ‌ర‌కు వెళ్తున్నాయి. శివారు ప్రాంతాల‌కు వెళ్ల‌టం లేదు. విజ‌య‌వాడ‌లోని ఉడా కాల‌నీ, జ‌ర్న‌లిస్టు కాల‌నీ, రాజీవ్ న‌గ‌ర్, అజిత్ సింగ్ న‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ కాల‌నీ, నంద‌మూరి న‌గ‌ర్‌, ఎల్‌బిఎస్ న‌గ‌ర్‌, వాంబే కాల‌నీ, మ‌ధురా న‌గ‌ర్‌, అయోధ్య న‌గ‌ర్‌, రామ‌కృష్ణాపురం, కొత్త రాజ‌రాజేశ్వ‌రిపేట‌, పాత రాజ‌రాజేశ్వ‌రి పేట‌, పైపుల రోడ్డు, శాంతి న‌గ‌ర్‌, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, జక్కంపూడి, పాత‌పాడు, పి.నైన‌వ‌రం, చిట్టిన‌గ‌ర్‌, మిల్క్ ప్రాజెక్టు, వించిపేట‌, భ‌వానీపురం, హెచ్‌బీ కాల‌నీ, విద్యాధ‌ర‌పురం ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం కాస్తా జాప్యం జ‌రుగుతోంది. అయితే ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ధ‌ర‌ల‌ను పెంచి అమ్ముతున్నారు.

విజయవాడ సింగ్‌నగర్‌లో వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి అమ్మకం. శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్లి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు. పంపిణీలో అధికారుల పర్యవేక్షణ లేదని ప్రజల ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం పంపిణీ చేయలేదని బాధితుల ఆందోళన చేస్తున్నారు. బ్లాక్‌లో ఆహారం కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవ‌ని బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

అర‌లీటరు పాలు రూ.80

వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన విజ‌య‌వాడ‌లో పాల కొర‌త తీవ్ర‌మైంది. ఇదే అదునుగా వ్యాపార‌లు రేట్లు పెంచేశారు. అర‌లీట‌ర్ పాల ప్యాకెట్ రూ.70-80 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇళ్ల‌లో చిన్న పిల్ల‌లు ఉన్నార‌ని, క‌నీసం ఒక్క పాలు ప్యాకెటైనా ఇవ్వాల‌ని అధికారుల‌ను వేడుకుంటున్నారు. విజ‌య డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియ‌న్ సెంట్ర‌ల్ ఆఫీస్ మునిగిపోవ‌డంతో ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి.

సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ల‌రించేందుకు రూ.1,500 నుంచి రూ.4,000 వ‌సూలు

మ‌రోవైపు ముంపు ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు బోటు య‌జ‌మానులు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ద‌గ్గ‌ర ప్రాంతాల‌కు అయితే రూ.500 నుండి రూ.1,000 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. అదే దూర ప్రాంతాల‌కు అయితే రూ.1,500 నుండి రూ.4,000 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నార‌ని బాధితులు తెలుపుతున్నారు. క‌నీసం మాన‌వ‌త్వం కూడా లేకుండా ధ‌ర పెంచి మంచినీళ్లు, పాలు వంటి నిత్యావ‌స‌ర వ‌స్తువులు అమ్ముతున్నార‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రులు, రాజ‌కీయ నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల‌తో స‌హాయ‌క చర్య‌ల‌కు అంత‌రాయం

ముంపు ప్రాంతాల్లో మంత్రులు, రాజకీయ నాయకుల పర్యటనలతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం క‌లుగుతోంది. వీవీఐపీల ప్రోటోకాల్ కోసం పోలీసుల ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రూట్ క్లియర్ చేయడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం పోలీసులు శ్రమిస్తున్నారు. సమీక్షల్లో అధికారులు, క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందితో సమన్వయం కుదరటం లేదు. రాజకీయ ప‌ర్యట‌న‌ల‌కు బ్రేక్ ఇస్తే సహాయ చర్యల్లో వేగం పుంజుకునే అవకాశ‌ముంది. పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందికి కమ్యూనికేషన్ రేడియోలు అంద‌లేదు. బ్యాటరీలు అయిపోవడంతో క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం అందటం లేదు. విజ‌య‌వాడ న‌గరంలోని పలు ప్రాంతాల్లో కేటాయించిన విధుల్లో అందుబాటులో సిబ్బంది లేరు.

హైకోర్టుకు రెండు రోజులు సెల‌వు

హైకోర్టు, ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్ళే కరకట్ట దారిలో మంతెన ఆశ్రమం వద్ద కరకట్టకు పడ్డ గండిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నందున ఏపీ హైకోర్టుకు రెండు రోజులు సెలవు ప్రకటించాల్సిందిగా, హైకోర్టు రిజిస్ట్రార్‌కు గుంటూరు కలెక్టర్ ఎస్‌. నాగ‌లక్ష్మి లేఖ రాశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కృష్ణా న‌దిలో వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని, 11.4 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు ప్ర‌కాశం బ్యారేజీకి వ‌చ్చిప‌డింద‌ని అందులో పేర్కొన్నారు. హైకోర్టు, ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్ళే కరకట్ట దారిలో మంతెన ఆశ్రమం వద్ద కరకట్టకు పడ్డ గండి ప‌డింద‌ని, దాన్ని మ‌ర‌మ్మ‌త్తులు చేసేందుకు రెండు రోజులు హైకోర్టుకు సెల‌వు ప్ర‌క‌టించాల‌ని కోరారు. అందులో భాగంగా రెండు రోజులు సెల‌వు ప్ర‌క‌టించారు.

75 వేల మందుల కిట్లు

విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద బాధితుల‌కు దాదాపు 75 వేల అత్యావ‌స‌ర మందుల కిట్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంటీ కృష్ణ‌బాబు తెలిపారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో 14 మెడిక‌ల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవ‌స‌ర కిట్లు చేర‌వేశామ‌ని అన్నారు. మ‌రికొన్ని కిట్లను 10 మొబైల్ మెడిక‌ల్ వాహ‌నాల ద్వారా అందిస్తామ‌ని చెప్పారు. రిలీఫ్ క్యాంపుల్లో 24 గంట‌లూ వైద్య సేవ‌లు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటార‌ని తెలిపారు.

-జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు