AP High Court : గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష, జరిమానా- హైకోర్టు ఆదేశాలు
AP High Court : కోర్టు ధిక్కరణ కేసులో గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
AP High Court : ఏపీలో ఇటీవల తరచూ ప్రభుత్వ అధికారులు హైకోర్టు ఆగ్రహానికి గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలులో నిర్లక్ష్యం కారణంగా కోర్టు అధికారులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయలేదన్న కారణాలతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ధర్మాసనం నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
నెల రోజుల జైలు శిక్ష
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రంలో ఎటువంటి లీజ్ చెల్లించకుండా పాఠశాలను నడుపుతున్నారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్‌లకు రూ.25 లక్షలు చెల్లించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల అమలులో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వహించారు. దీంతో పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లీజు చెల్లించడంలేదని పిటిషన్
గుంటూరు కొత్తపేటలో యడవల్లి వారి సత్రానికి చెందిన 3,300 గజాల స్థలాన్ని 1965లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమించి పాఠశాల నిర్వహిస్తోందని విజయవాడకు చెందిన కప్పగంతు జానకిరాం హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తిని ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. లీజు చెల్లించకుండా సత్రాన్ని స్వాధీనం చేసుకున్నవారు ఎవరైనా ఆక్రమణదారులే అవుతారని పిటిషన్ వాదించారు. ఏళ్ల తరబడి తన ఆస్తిని వాడుకుంటున్నందుకు బాకాయి పడిన రూ. 2.70 కోట్లు తక్షణమే చెల్లించి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశించమని హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు గతంలో రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
చెల్లించలేమని కౌంటర్ పిటిషన్
అయితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గతంలో కౌంటర్ దాఖలు చేసింది. ఆ బకాయిలు చెల్లించలేని స్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉందని, పేదల సంక్షేమం కోసం ఆ సత్రంలో ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నామని కోర్టుకు తెలిపింది. లీజ్ బకాయిలు రద్దు చేయాలని కోర్టును కోరింది. హైకోర్టు గతేడాది ఏప్రిల్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ....రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ప్రతి నెలా ప్రతి చదరపు అడుగుకు రూ.2 చొప్పున అద్దె చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను మున్సిపల్ కార్పొరేషన్ అమలుచేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష విధించింది.