Kodali Nani On CBN PK Meet : చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌, పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది- కొడాలి నాని-gudivada news in telugu ex minister kodali nani sensational comments on chandrababu prashant kishor meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kodali Nani On Cbn Pk Meet : చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌, పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది- కొడాలి నాని

Kodali Nani On CBN PK Meet : చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌, పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది- కొడాలి నాని

Bandaru Satyaprasad HT Telugu
Dec 24, 2023 04:04 PM IST

Kodali Nani On CBN PK Meet : చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎంత మంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ఏం చేయలేరన్నారు.

కొడాలి నాని
కొడాలి నాని

Kodali Nani On CBN PK Meet : టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో టీడీపీ నేతలు పీకేపై చేసిన విమర్శలను గుర్తుచేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పీకే భేటీపై సెటైర్లు వేశారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని విమర్శలు చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీకి పనిచేసినప్పుడు దారుణంగా తిట్టిన ఎల్లో బ్యాచ్‌ వాటిని మరిచిపోయిందా? అని విమర్శించారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ ను ఏం చేయలేరు

చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా, సీఎం జగన్‌ను పీకేదేం లేదని మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ పూర్తిగా వాడేసిందన్నారు. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందని విమర్శించారు. వైసీపీ వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఏం పీకుతాడన్న చంద్రబాబు, ఇవాళ ఏం పీకడానికి భేటీ అయ్యారో టీడీపీ నేతలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఎంత మంది పీకేలను పక్కన పెట్టుకున్నా సీఎం జగన్ ఏం చేయలేరన్నారు. ఐప్యాక్‌తో ప్రశాంత్‌ కిషోర్‌కు సంబంధం లేదని స్పష్టంచేశారు. చంద్రబాబును ప్రశాంత్‌ కిషోర్‌ కలిస్తే ఎల్లో బ్యాచ్ హడావుడి చేస్తోందన్నారు.

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం

అయితే ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే పీకే చంద్రబాబును కలిశారన్నారు. బాబాయ్‌ను హత్య చేసేందుకు పీకేనే ప్లాన్‌ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తి డ్రామా టీడీపీ చేసిన విమర్శలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటారా?. ఏం చేస్తారో వాళ్లకే తెలియాలన్నారు. లోకేశ్ తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో చర్చలు జరుపుతుంటే, మరో పీకే ప్రశాంత్‌ కిషోర్‌ ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మరోసారి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి కోసం పనిచేసిన పీకే.. చంద్రబాబుతో సమావేశం కావడంతో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్న ఐప్యాక్ సంస్థ పీకేతో తమ సంస్థలో లేరని ప్రకటించింది.

Whats_app_banner