AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆర్థిక భారాన్నిఏపీ సర్కారు అధిగమించేదెలా?
AP Free Bus Scheme: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పడుతోన్న ఆర్థిక భారాన్ని రాష్ట్రప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనే చర్చలు జరుగుతున్నాయి.ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడంతో ఎంత ఆర్థిక భారం పడుతుందో అంచనా వేస్తున్నారు.
AP Free Bus Scheme: అసెంబ్లీ ఎన్నికల‌్లో టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసింది. ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తున్న ఈ ఆరు హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అయితే ఈ ఆరింట్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేసేందుకు చర్చలు జరుగుతోన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత బస్ ప్రయాణంపై సమీక్ష కూడా నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అందులో 8,220 బస్సులు సొంతవి కాగా, మిగిలిన బస్సులు అద్దెవి. గత ప్రభుత్వం హయంలో కొత్తగా 1,480 బస్సులు కొనుగులు చేపట్టింది. అయితే ఈ బస్సులు ఎన్నికల తరువాత డెలివరీ అయ్యాయి. ఇప్పుడు ఆ బస్సులను కూటమి నేతలు ప్రారంభిస్తున్నారు.
అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అదనంగా మరో 2,000 వేలు కొత్త బస్సులు అవసరం అవుతాయి. అలాగే 3,500 మంది కొత్తగా డ్రైవర్లు కావాల్సి ఉంటుందని ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసిన అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని వినియోగించుకుని 1,253 విద్యుత్ బస్సులను సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రతినెల రూ.250 కోట్ల నుంచి రూ.260 కోట్ల ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. అయితే తప్పని సరిగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి లాభం వస్తుంది. అలాగే అక్యుపెన్సి రేషియో (ఓఆర్) వంద శాతానికి చేరుకుని ఆర్టీసీ లాభాలు వస్తాయి. ప్రతినెల ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 25 శాతం ( దాదాపు రూ.125 కోట్లు) వరకు ప్రభుత్వానికి వెళ్తోంది.
ఇకపై ఆ మొత్తం రాకపోగా, అదనంగా రూ.125 కోట్ల నుంచి రూ.135 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది. వాస్తవానికి మహిళలకు ఉచిత బస్సును ఆగస్టు 15 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకంపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో 60 ఏళ్ల దాటిన సీనియర్ సిటిజన్స్‌కు 25 శాతం రాయితీ ఉంది.
దేశంలో పది రాష్ట్రాల్లో అమలు
ఇప్పటికే దేశంలో పది రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో అమలు అవుతోంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పథకం పూర్తి స్థాయిల్లో అమలు అవుతోంది.
కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పాక్షికంగా అమలు అమలు అవుతోంది. కేరళలో మత్స్యకారులకు పురుషులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. మహారాష్ట్రలో 65 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ, 75 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతోంది.
హర్యానాలో 60 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో నారీకి నయన్ స్కీమ్ పేరుతో మహిళలందరికీ 50 శాతం రాయితీ కల్పించారు. ఉత్తరప్రదేశ్‌లో 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నారు.
అలాగే ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి 48 దేశాల్లోని వివిధ నగరాల్లో కూడా ఈ ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. అమెరికాలోని కేంసన్ లక్సెంబర్గ్ దేశంలో పూర్తిగా, పెండ్లాన్‌లోని మేరీ హాయం, ఆస్ట్రేలియాలోని పెర్త్, ఇంగ్లాండ్ లోని డ్యూస్ బరి, స్వీడన్ లోని అవిష్టా, బల్గేరియాలోని స్మకౌలో ఉచిత ప్రయాణాలు అమలు జరుగుతోన్నాయి.
తెలంగాణలో అమలు తీరు
తెలంగాణలో దాదాపు ఆరు నెలల్లోనే రూ.1,080 కోట్లు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రోజువారీ టిక్కెట్లు ద్వారా వచ్చే ఆదాయం రూ.16 కోట్లు నుంచి రూ.10 కోట్లకు తగ్గింది. ఈ పథకం అమలకు ముందు తెలంగాణలో రోజుకు 34 లక్షల మంది బస్సును ఉపయోగించే ప్రయాణికులు ఇప్పుడు 47 లక్షల ప్రయాణికులకు పెరిగింది.
సగటున రోజుకు 30 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణ చేస్తున్నారు. 69 శాతం ఉన్న అక్యుపెన్సి రేషియో (ఓఆర్), మహిళలకు ఉచిత బస్సు పథకంతో 96 శాతం, అంటే 27 శాతం పెరిగింది. తెలంగాణ ఆర్టీసీలో 8,564 బస్సులు ఉండగా, 7,292 బస్సుల్లో ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. ఇంకా 2,600 కొత్త బస్సులు కొనాల్సి ఉంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.300 నుంచి 400 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఏపీలో ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తే ఆ నష్టాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం ఎలా భర్తీ చేయాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)