ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో.. రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరిశ్రమలో పనిచేసే కార్మికులు రెండు రసాయనాలను మిక్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన కార్మికులను పరామర్శించాలని హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెజ్‌లో జరిగిన ఘటన మరువకముందే.. ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 36 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.