Simhachalam Ghee : సింహాచలం ఆలయంలో నెయ్యి తనిఖీ.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. కారణం ఇదే!
Simhachalam Ghee : తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై సర్కారు దృష్టి సారించింది. సింహాచలం ఆలయంలో నెయ్యిని తనిఖీ చేసిన అధికారులు, నాణ్యతలో దారుణంగా తేడా ఉండటం గమనించి సీజ్ చేశారు.
తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సింహాచలం కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లేని నెయ్యి వినియోగిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శనివారం ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ప్రసాదంలో నెయ్యి సహా ఉపయోగించే పదార్థాలు, తయారీ విధానాన్ని పరిశీలించారు. మెటీరియల్ భద్రపరిచే గదిని సందర్శించి, రిజిస్టర్ నమోదులు, లడ్డూల బరువును తనిఖీ చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యాపారి కిలో రూ.385 చొప్పున నెయ్యి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాని నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు.
'విశాఖ డెయిరీ, అమూల్ కిలో నెయ్యి ధర సుమారు రూ.650 నుంచి 700 ఉంది. నాణ్యమైన నెయ్యి కిలోకు రూ.1,000 కంటే ఎక్కువ ధర ఉంటుంది. కేవలం రూ.385కి సరఫరా అవుతున్న నెయ్యిని మీరు ఎలా అంగీకరించగలరు?' అని దేవస్థానం సిబ్బందిని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వివిధ రకాల పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలోని స్టోర్ రూమ్‌లో నెయ్యి కొనుగోళ్ల వివరాలను పరిశీలించి షాక్‌కు గురయ్యానని చెప్పారు. 2019-20లో ఒక కిలో నెయ్యి రూ.500కి కొనుగోలు చేశారు. 2020-21లో రూ.488కి, 2021-22లో రూ.591కి కొనుగోలు చేశారని వివరించారు. ఆశ్చర్యకరంగా 2022-23లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంపెనీ నుండి దేవస్థానం నెయ్యిని కిలో రూ.393కి కొనుగోలు చేసిందని చెప్పారు. 2023-24లో అనేక ఏజెన్సీలను మార్చారని అనుమానాలు వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పుడు.. దేవస్థానం కొనుగోలు చేస్తున్న నెయ్యి ధర కిలోకు రూ.200 కంటే ఎక్కువ తగ్గిందని గంటా వ్యాఖ్యానించారు. ఇది షాక్‌గా ఉందన్నారు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో విశాఖ డెయిరీ యూనిట్ ఉండగా.. ఉత్తరప్రదేశ్ నుంచి నెయ్యి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుందన్నారు. ఏదైనా ఏజెన్సీ ఒక కిలో నెయ్యి రూ.100కి అందజేస్తే.. దానిని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.
'గతంలో సింహాచలం ఆలయంలో తయారు చేసిన లడ్డూలతో పోల్చితే.. ఇప్పుడున్న లడ్డూలు అస్సలు బాగుండడం లేదు. ప్రస్తుతం ఒకే ఒక్క సీసీ కెమెరా ఉన్నందున.. వెంటనే స్టోర్ రూంలో సీసీ కెమెరాలు, లడ్డూ తయారీ గదిలో సీసీ కెమెరాలు పెంచాలని దేవస్థానం అధికారులను కోరాను. గత కొన్ని నెలలుగా సీసీటీవీ ఫుటేజీని ఆరా తీశాను. ఏవైనా అవకతవకలకు పాల్పడితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మరోవైపు విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పి.విష్ణుకుమార్ రాజు ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీతో కలిపి రూ.385కి ఒక కిలో నెయ్యి కొనుగోలు చేశారని.. అంటే కిలో రూ.340కి వచ్చిందని చెప్పారు. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. అదే యూపీకి చెందిన కంపెనీ అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తోందని.. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.