Rtd IAS Political Party: “పేదల ఆస్తులు లాక్కోవడమే పెత్తందారులపై యుద్ధమా… ” ఏపీలో ఐఏఎస్‌ అధికారి కొత్త పార్టీ ఏర్పాటు-exias vijaykumar started another new party in ap named liberation congress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtd Ias Political Party: “పేదల ఆస్తులు లాక్కోవడమే పెత్తందారులపై యుద్ధమా… ” ఏపీలో ఐఏఎస్‌ అధికారి కొత్త పార్టీ ఏర్పాటు

Rtd IAS Political Party: “పేదల ఆస్తులు లాక్కోవడమే పెత్తందారులపై యుద్ధమా… ” ఏపీలో ఐఏఎస్‌ అధికారి కొత్త పార్టీ ఏర్పాటు

Sarath chandra.B HT Telugu
Feb 15, 2024 07:17 AM IST

Rtd IAS Political Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవతరించింది. కొద్ది నెలలుగా పాదయాత్ర నిర్వహిస్తున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ లిబరేషన్‌ కాంగ్రెస్‌ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.

రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్
రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్

Rtd IAS Political Party: పేదల ఆస్తులు, సంపద లాక్కుంటూ వారిని పీడించడమే పెత్తందారులపై యుద్ధమంటే అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. 'లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ'ని ఏర్పాటు చేస్తున్నట్లు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ ప్రకటించారు.

yearly horoscope entry point

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో పార్టీ పేరును వెల్లడించారు. కొద్ది నెలలుగా తుని నుంచి తడ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 2700 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహించినట్టు ప్రకటించారు.

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే లక్ష్యంతోనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాదయాత్ర ప్రారంభించారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితంగా మెలిగారు.

రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని మొదటి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తిరుపతి, బాపట్ల రిజర్వుడు పార్లమెంటు నియోజక వర్గాల నుంచి వైసీపీ లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన చివరకు సొంత పార్టీ ప్రకటించారు.

పెత్తందారులపై యుద్ధం అంటే అదేనా…

పొలిటికల్ పార్టీ ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెత్తందారులపై యుద్ధం అంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న జనాభాకు ఆస్తులు, సంపద పంచకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఇసుక, మట్టి వంటి సహజ సంపదను మాత్రం కొన్ని వర్గాలు మాత్రమే దోచుకుంటున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో చేపలు పట్టుకుని బతికే యానాదుల వంటి సంచార ప్రజలు కనీసం చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం కూడా పెత్తందారులు ఇవ్వట్లేదని ఆరోపించారు.

1970 నుంచి వివిధ ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు భూముల్ని అసైన్డ్‌ భూములుగా కేటాయిస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్‌ భూముల్ని అన్యాక్రాంతం చేసేలా చట్ట సవరణ చేశారన్నారు. టీడీపీ హయంలోనే అసైన్డ్‌ భూముల చట్ట సవరణకు ప్రయత్నించినా రాజకీయ కారణాలతో భయపడి వెనుకడుగు వేస్తే జగన్ మాత్రం పెత్తందారుల ప్రయోజనాలు కాపాడేందుకు చట్టాల్ని మార్చేశారని ఆరోపించారు.

దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన భూముల్ని బలవంతంగా లాక్కుంటే వాటిని జగన్‌ వారికే కట్టబెట్టేలా చట్ట సవరణ చేయడం పేదలపై యుద్ధం ఎలా అవుతుందన్నారు. పేదరికంపై యుద్ధం, పెత్తందారులపై యుద్ధం అనే జగన్ మాటలు నిజమైతే పెత్తందారీ వర్గాల దురాక్రమణలో ఉన్న భూముల్ని తిరిగి అసైన్‌ చేసిన వారికి అప్పగించాలని, అసైన్డ్ దారులు లేకపోతే వారి వారసులకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

అసైన్డ్‌ చట్ట సవరణ విషయంలో చంద్రబాబు కూడా ఏమి మాట్లాడలేదని, తమ వర్గాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందునే దానిని స్వాగతించారని ఆరోపించారు. తక్షణం చట్టాన్ని సవరించి పేదలకు భూములు పంచాలన్నారు. భూములు, సంపద పంపిణీ చేయకుండా పేదరికం ఎలా నిర్మూలిస్తారని ప్రశ్నించారు.

బానిసలుగా మారుస్తున్నారు….

సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతూ ప్రజల్ని ఓట్లు వేసే బానిసలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీలకు ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసి వారి ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని, ఎప్పటికి ప్రభుత్వం మీద ఆధారపడే బానిసలుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న వర్గాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. స్వయం ఉపాధి పథకాలు తీసేసి ఏమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదరణ వంటి పథకాలతో వెనుకబడిన వర్గాలను కుల వృత్తులకు పరిమితం చేయాలనుకున్నారని, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే రకమైన నాయకులని ఆరోపించారు.

వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గాలంటూ మభ్య పెడుతూ వారికి 56 కార్పొరేషన్లు ఇచ్చి ఏమి సాధించారని ప్రశ్నించారు. నెలకు రూ.50వేల జీతం ఇచ్చి అధికారాలు లేని కార్పొరేషన్లు పంచారని మండిపడ్డారు. అదే పాలక పార్టీ సొంత సామాజిక వర్గానికి మాత్రం అన్ని అధికారాలతో నెలకు రెండున్నర లక్షల వేతనాలతో సలహాదారులు ఉంటారని, కార్పొరేషన్ ఛైర్మన్లకు లేని అధికారాలు సలహాదారులకు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు సామాజికి వర్గాలకు మాత్రమే అన్ని ప్రయోజనాలు దక్కుతున్నాయనే సత్యాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

దళితులపై దాడులు జరిగినపుడు కనీసం ఆ సామాజిక వర్గాల ప్రతినిధులు కూడా వాటిని ఖండించలేని నిస్సహాయ స్థితి ఉందని ఆరోపించారు. హత్య, దాడులు జరుగుతున్నా ఎవరు వాటిని ఖండించడం లేదని అలాంటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వం ఎలా అవుతుందన్నారు. సమాజంలో కనీసం మత స్వేచ్ఛ కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయనే సంగతి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. 1

విద్యా, వైద్యం, సంక్షేమం వంటి విషయాల్లో ప్రభుత్వం చెప్పేవన్నీ అసత్యాలేనని ప్రజలు తమ ఓటు హక్కుతోనే తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోగలరన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని నోటాకు వేసిన నష్టం ఉండదని, మోసం చేసే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.

Whats_app_banner