VMC Tax Pressure: వరదల్లో జనం సర్వం కోల్పోయినా.. పన్నుల వసూలు కోసం విజయవాడ కార్పొరేషన్ ఒత్తిడి..
VMC Tax Pressure: విజయవాడ నగరంలో లక్షలాదిమంది ప్రజలు వరద ముంపుకు గురై సర్వం కోల్పోయిన సమయం నగర పాాలక సంస్థ పన్ను చెల్లింపు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంతో బుడమేరు వరద ముంపుతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిన వేళ పన్నుల కోసం ప్రకటనలిచ్చారు.
VMC Tax Pressure: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి నగరంలోని 32 డివిజనల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. పది రోజుల పాటు వరద ముంపులో చిక్కుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆదివారం జారీ చేసిన ప్రకటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వరద బాధితులపై ఏమాత్రం సానుభూతి లేకుండా సెప్టెంబర్ 30వ తేదీలోగా పన్ను బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు జారీ చేయడంపై ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులంతా తమ తమ ఆస్తి పన్ను, మంచి నీటి కుళాయి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, వాటర్ మీటర్ చార్జీలు, ఖాళీ స్థలముల పన్నులను మొదటి అర్ధ సంవత్సరానికి సెప్టెంబర్ 30వ తేదీలోగా చెల్లించాలని ఆదివారం నగర పాలక సంస్థ ప్రకటించింది. 30వ తేదీలోపు పన్ను చెల్లించకపోతే జరిమానాలు ఉంటాయని, నగరంలోని 3 సర్కిల్ కార్యాలయాల్లో , విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పన్నులు చెల్లించాని పేర్కొన్నారు.
ఎటు చూసినా కన్నీళ్లే….
విజయవాడ నగరంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో లక్షలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. ఒక అంతస్తులోపు ఉన్న భవనాలు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో ఉంటున్న వారికి కట్టుబట్టలు మినహా ఏమి మిగల్లేదు. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉండగా వరద ముంచెత్తడం ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఎవరికి ఏమి మిగలకుండా పోయింది.
ఈ క్రమంలో నగర పాలక సంస్థ పన్ను బకాయిల కోసం ప్రకటనలు ఇవ్వడం వరద బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా, 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తూ ప్రకటనలు విడుదల చేయడంపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడ నగరంలో 32 డివిజన్లలో దాదాపు 2,70,000 కుటుంబాలకు పైగా వరద ముంపుకు గురయ్యారు. వీరిలో కనీసం లక్షన్నర కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండే అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉంటారు. దాదాపు 8 లక్షల మంది జనాభా వరదల్లో నీట మునిగి సర్వస్వం కోల్పోయారు. ఉపాధి లేక, వస్తువులు, వాహనాలు పాడైపోయి దుర్బర పరిస్థితులలో వేలాదిమంది చిక్కుకున్నారు. వేతన జీవులు మినహా అసంఘటిత రంగంలో ఉపాధి పొందే వారి పరిస్థితి ఘోరంగా ఉంది.
వరద ముప్పును హెచ్చరించడంలో విఫలమైన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పన్ను వసూళ్ల విషయంలో మాత్రం ప్రకటనలివ్వడంపై వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విజయవాడలో వరద నష్టం తీవ్రత పెరగడానికి ప్రజలను ఏమాత్రం అప్రమత్తం చేయని వ్యవస్థల వైఫల్యమే ఎక్కువగా ఉంది. బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో పన్నులు చెల్లించకపోతెే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తూ ప్రకటనలు జారీ చేయడంపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ ఏడాది ముంపు ప్రాంతాల్లో పన్ను రద్దు చేయాలి…
నెలాఖరులోగా పన్నులు చెల్లించకపోతే పెనాల్టీలు పడతాయని పరోక్షంగా హెచ్చరించటం బాధాకరమని, సెలవు దినాలతో సహా, రాత్రి 8 గంటల వరకు వసూళ్లు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబురావు తప్పు పట్టారు. బాధితులకు సేవలు అందించడంపై దృష్టి పెట్టవలసిన నగరపాలక సంస్థ పన్నుల వసూళ్లపై అత్యుత్సాహం చూపించటం సరికాదని, మున్సిపల్ శాఖ మంత్రి బాధితులను ఆదుకుంటామని ప్రకటనలు ఇస్తుంటే , పన్నుల వసూళ్లపై నగరపాలక సంస్థ ఆదేశాలు ఇవ్వటం భావ్యం కాదన్నారు.
2024- 25 సంవత్సరానికి సంబంధించి వరద బాధిత ప్రాంతాలలో ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజీ, ఖాళీ స్థలాల పన్ను పూర్తిగా రద్దు చేయాలని, అందుకు మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలి, పన్నుల రద్దు వల్ల కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే నగరపాలక సంస్థకు చెల్లించాలన్నారు.