Energy Demand In AP: ఎండలతో పాటు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
Energy Demand InAP: ఏపీలో ఎండలతో పాటు విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్ నెలలోనే గరిష్ట స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుండటంతో మే నెలలో వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Energy Demand InAP: వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను మెరుగు పరిచేందుకు ప్రణాళిక ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు.
అవసరాలకు తగ్గట్టుగా డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సమకూర్చుకోవాలని, కోతలు విధించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రస్తుత వేసవిలో విద్యుత్ డిమాండ్ ఏ విధంగా ఉంది? పెరిగే అవసరాలను తీర్చేందుకు అమలుచేస్తున్న ముందస్తు ప్రణాళికలు ఏమిటని ఆయన ఇంధన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మే నెల వచ్చే సరికి వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుందని, కాబట్టి డిమాండ్ మేరకు విద్యుత్ సమకూర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ నెలలో రానున్న 18 రోజుల్లో భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని, కొరత లేకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మార్గనిర్థేశం చేశారు.
రోజువారీ 250 మిలియన్ యూనిట్ల డిమాండ్….
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి వడగాల్పులు నమోదు అవుతాయని ఐ.ఎం.డి. అంచనాల నేపథ్యంలో ఈ వేసవిలో రోజు వారీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా 240 నుండి 250 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సి.ఎస్.దృష్టికి తీసుకువెళ్లారు. రోజుకు 240 మిలియన్ యూనిట్లు డిమాండ్ వరకు ఎలాంటి సమస్య లేకుండా సరఫరా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.
రోజు వారీ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లు దాటితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని వివరించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో రోజువారీ విద్యుత్ వినియోగం 212.33 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే నెలలో 238.40 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
డిమాండ్ పై ముందస్తు అంచనా……
ఏపి ట్రాన్స్ కో లోడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా రాబోయే రోజు విద్యుత్ డిమాండ్ ఎంత ఉంటుందో ముందు రోజే అంచనా వేసుకుని ఆమేరకు సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్దంగా చేసుకుంటున్నామని ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ సి.ఎస్.కు వివరించారు. ప్రస్తుతం రోజు వారీ విద్యుత్ డిమాండ్ లో 45 శాతం మేరకు సుమారు 102 మిలియన్ యూనిట్లు ఏపీ జన్ కో ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుందన్నారు. మిగిలిని విద్యుత్ ను మార్కెట్ లో కొనుగోలు చేస్తున్నామని వివరించారు.