AP PG CET 2024: నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఏపీ పీజీ సెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్-edit option for ap pg set 2024 applications which will be available from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pg Cet 2024: నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఏపీ పీజీ సెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్

AP PG CET 2024: నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఏపీ పీజీ సెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్

Sarath chandra.B HT Telugu
May 27, 2024 09:52 AM IST

AP PG CET 2024: ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ నేటి నుంచి అందుబాటులో ఉంటుంది.

నేటి నుంచి ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్‌ అప్లికేషన్స్ ఎడిట్ ఆప్షన్
నేటి నుంచి ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్‌ అప్లికేషన్స్ ఎడిట్ ఆప్షన్

AP PG CET 2024: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ దరఖాస్తుల్ని సరిదిద్దుకోడానికి నేటి నుంచి అవకాశం కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా ముగిసింది. పీజీసెట్ 2024ను విశాఖపట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పీజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ నోటిఫికేషన్ PG Common Entrance మార్చి 31న విడుదలైంది. ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న వారు కూడా ఏపీ పీజీ సెట్‌ 2024కు హాజరు కావొచ్చు.

ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ ద్వారా పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసిజె, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఇడి, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ కామన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ Online Exam ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage.aspx# ద్వారా పీజీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కు నమోదు చేసుకోవచ్చు.

పీజీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టు పరీక్షకు జనరల్ క్యాటగిరీలో రూ.850 ఫీజుగా చెల్లించాలి. బీసీ విద్యార్ధులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650 ఎంట్రన్స్‌ ఫీజు చెల్లించాలి. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్‌, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

పీజీ సెట్ 2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1నుంచి ప్రారంభమైంది.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 1

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ మే 4వరకు

రూ.500ఆలస్య రుసుముతో మే 15వరకు స్వీకరిస్తారు. రూ. 1000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను జూన్ 10న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

నేటి నుంచి ఎడిట్ ఆప్షన్…

మే 27, 28 తేదీల్లో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్‌ వెల్లడించారు. మే 31వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఏయూ వీసీ ప్రసాద రెడ్డి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్‌ 10 నుంచి 14వ తేదీ వరకు ఏపీ పీజీ సెట్‌-2024 నిర్వహిస్తారు. పీజీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్ధులు ఐదు దశల్లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎంచుకున్న కోర్సు, దానికి అర్హతలను పరిశీలించాల్సి ఉంటుంది.అర్హతలు నిర్ధారించుకున్న తర్వాత ఫీజు చెల్లించాలి.

రెండో దశలో పరీక్ష ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తైందో లేదో చూసుకోవాలి. మూడో దశలో దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగో దశలో దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. ఐదవ దశలో ఫీజు చెల్లించిన తర్వాత అదనపు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగిసినందున అప్లికేషన్‌లో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే నేడు, రేపు వాటిని సరిదిద్దుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం