Bezawada Schools: స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్‌, లక్షల్లో నగదు.. బెజవాడ స్కూళ్లలో డేంజర్ బెల్స్‌-drugs lakhs of cash in the bags of school students commotion in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bezawada Schools: స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్‌, లక్షల్లో నగదు.. బెజవాడ స్కూళ్లలో డేంజర్ బెల్స్‌

Bezawada Schools: స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్‌, లక్షల్లో నగదు.. బెజవాడ స్కూళ్లలో డేంజర్ బెల్స్‌

Sarath chandra.B HT Telugu
Aug 08, 2024 06:27 AM IST

Bezawada Schools: ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం, విస్తృత లభ్యతతో చిన్నారుల స్కూల్ బ్యాగ్స్‌లోకి కూడా చేరిపోతున్నాయి. ఇటీవల విజయవాడలోని ప్రముఖ పాఠశాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

రోడ్లపైనే  ఆన్‌లైన్ బెట్టింగ్.. విజయవాడలో అన్ని ప్రాంతాల్లో యథేచ్చగా సాగుతున్న జూదాలు
రోడ్లపైనే ఆన్‌లైన్ బెట్టింగ్.. విజయవాడలో అన్ని ప్రాంతాల్లో యథేచ్చగా సాగుతున్న జూదాలు

Bezawada Schools: ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాల వినియోగంపై గత కొంత కాలంగా నెలకొన్న ఆందోళనకు అద్దంపట్టే ఘటన వెలుగు చూసింది. స్కూల్ విద్యార్ధుల బ్యాగ్‌లలో డ్రగ్స్‌, లక్షల్లో నగదు పట్టుబడింది. ఆ తర్వాత వరుస ఘటనలు వెలుగు చూడటంతో పాఠశాలల్లో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది.

వారం రోజుల క్రితం విజయవాడలో ప్రముఖ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా కొందరు విద్యార్ధులు టాయిలెట్స్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తూ కనిపించారు. వెంటనే 9,10వ తరగతులకు చెందిన విద్యార్ధుల స్కూల్ బ్యాగ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో కొందరి వద్ద ఎలక్ట్రానిక్ సిగర్స్‌, గంజాయి వంటి మత్తు పదార్ధాలు లభించాయి. వాటిని వినియోగిస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిచి స్కూల్ యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చింది. బాధ్యులైన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూశాయి.

కొద్ది రోజుల క్రితంఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ గేమ్స్‌లో లక్షల రుపాయలు సంపాదించాడు. వాటిని తన వద్ద ఉంచుకుంటే ఇబ్బంది కలుగుతుందని భావించి దాదాపు ఆరేడు లక్షల రుపాయల నగదును స్నేహితులకు ఇచ్చాడు. ఆ డబ్బును ఇళ్లకు తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడంతో స్నేహితుడు ఇచ్చాడని చెప్పడంతో వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

స్కూల్లో విచారణ చేపట్టడంతో సదరు విద్యార్ధి నిరంతరం ఆన్‌‌లైన్‌లో రకరకాల బెట్టింగ్ గేమ్స్‌ ఆడుతున్నట్టు తేలింది. వాటితో సంపాదించిన డబ్బును స్నేహితులకు ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనకు బాధ్యుడైన విద్యార్ధిపై కూడా స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ డబ్బును పాఠశాలకే వదిలేసినట్టు సమాచారం. ఈ డబ్బును ఏమి చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.

స్టార్ హోటళ్లలో పార్టీలు…

9వ తరగతి చదివే కొంతమంది విద్యార్ధులు ఇటీవల విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్లో పార్టీ చేసుకున్నారు. 14ఏళ్లలోపు పిల్లలు మాత్రమే ఉన్న బృందానికి నగరంలోని చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై ఉన్న స్టార్ హోటల్లో పార్టీ చేసుకోడానికి అనుమతించారు. ఈ ఘటనలో కొందరు విద్యార్ధులు బీర్లు సేవించినట్టు తెలిసింది. హోటల్లో బర్త్‌ డే పార్టీ వ్యవహారం ఆలస్యంగా తెలిసిన పేరెంట్స్‌ స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. స్కూల్ బయట జరిగే ఘటనలకు తామెలా బాధ్యులం అవుతామని ప్రశ్నించడంతో చేసేది లేక పేరెంట్స్‌ మిన్నకుండి పోయారు.

పాఠశాలలో టాయిలెట్‌ ప్రదేశాలు మినహా, ప్రతి ప్రాంతం కవర్‌ అయ్యేలా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచినా విద్యార్ధులు గాడి తప్పుతున్నారని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఇళ్ల వద్ద తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ సమస్య వస్తోందని చెబుతున్నారు. పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో గమనించే తీరిక కూడా చాలామందికి ఉండటం లేదని ఇదే సమస్యలకు అసలు కారణమని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. రోజుకు 8 గంటలు మాత్రమే స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుందని మిగిలిన సమయంలో వారెక్కడ ఉంటున్నారో, ఏమి చేస్తున్నారో తమకెలా తెలుస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ అడిక్షన్ విద్యార్థులకు ప్రధాన శత్రువుగా మారిందని చెబుతున్నారు.

7,8 తరగతులకు వరకు క్రమశిక్షణ, మంచి ప్రతిభ చూపించిన విద్యార్ధులు కూడా 9,10 తరగతుల్లోకి రాగానే ఒక్కసారిగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్‌ మీటింగ్‌లో ఈ విషయాలను వివరించారు. విజయవాడలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన సదరు పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. విజయవాడలో విచ్చలవిడిగా లభిస్తున్న మాదకద్రవ్యాలు, మొబైల్ అడిక్షన్, ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌ పాఠశాల విద్యార్థుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

వీధివీధికో క్యాసినో..

ఏపీలో గత కొన్నేళ్లుగా రకరకాల సామాజిక రుగ్మతలు పెరుగుతున్నాయి. మాదక ద్రవ్యాల వ్యవహారం మాత్రమే ప్రధానంగా ప్రచారంలోకి వస్తున్నా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్స్‌ అంతకు మించి సాగుతున్నాయి. విజయవాడ వంటి నగరంలో కూడా ఈ తరహా బెట్టింగ్‌లు నిర్వహించే కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. రకరకాల ఆన్‌లైన ఆటల పేరుతో వేర్వేరు ముఠాలు చెలరేగిపోతున్నాయి.

ఈ ముఠాల గురించి పోలీసులకు తెలిసినా వాటిని చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలతో స్పెషల్ బ్రాంచ్‌ పోలీసులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్‌లలో డబ్బు వసూళ్ల కోసం దాడులు జరుగుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.

నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్లలో నిత్యం ఈ ఆన్‌‌లైన్‌ జూదం నడుస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రాంతాల వారీగా ముఠాలు వీటిని నడిపిస్తున్నాయి. ఈ తరహా కార్యక్రమాలను గతంలో యాంటీ గుండా స్క్వాడ్‌లు ఉక్కుపాదంతో అణిచివేసేవి. రకరకాల కారణాలతో టాస్క్‌ఫోర్స్‌లు నిర్వీర్యమైపోయాయి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడంకంటే వాటితో కలిసిపోతేనే ఎక్కువ లాభమని దిగువ స్థాయి సిబ్బంది భావిస్తున్నారు.

పేకాట క్లబ్బులు, గంజాయి పెడ్లర్లు, ఆన్‌లైన్‌ గేమ్‌ నిర్వాహకులు, డ్రగ్‌ పెడ్లర్లతో ఎస్బీ బృందాలు ఏళ్ల తరబడి సావాసం కొనసాగిస్తున్నాయి. గాంధీనగర్‌‌లో ఉన్న కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో బహిరంగంగా నిత్యం ఈ దందాలు నడుస్తున్నా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్ని బార్లలో పోలీసుల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ జూదాలు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.