Drones In Agriculture : రైతులకు డ్రోన్లు.. సబ్సిడీ ఎంత ఉంటుందంటే?
ఏపీ ప్రభుత్వం అన్నదాతల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు కావాల్సిన సమాచాన్ని ఇస్తోంది. వారిని ఆధునికత వైపు అడుగులు వేసేలా ప్రొత్సహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు.. సాంకేతికత వైపు ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది. సాగులో అధునాతన టెక్నాలజీని ఉపయోగించేందుకు సూచనలు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలతో సమాచారాన్ని రైతులకు చేరవేస్తూ. దిశానిర్దేశం చేస్తోంది. వైఎస్ఆర్ రైతు రథం, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాల ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు ప్రణాళికలు వేసిన విషయం తెలిసిందే.
వ్యవసాయానికి మరింత టెక్నాలజీని జోడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. రైతులకు మరింత సులభమయ్యే పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు చేస్తోంది. దీనికోసం సాగులో డ్రోన్ల వినియోగాన్ని.. అందుబాటులో తెస్తోంది. అందుకే రైతులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా మండలానికి మూడు డ్రోన్ల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ చేసేందుకు ఈజీగా ఉండనుంది. చాలామంది చేసే పని ఒకే ఒక్క డోన్ తో తక్కువ సమయంలో చేసేందుకు అవకాశం ఉంటుంది. డ్రోన్లతో పైనుంచి పిచికారీ చేస్తే.. పొలంలోని అన్ని మొక్కలపైనా.. మందు పడే అవకాశం ఉంది.
రైతు సహకార సంఘాల ద్వారా డ్రోన్లను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు, మహిళా రైతులు డ్రోన్ల సబ్సిడీ పథకానికి అర్హులని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ల కొనుగోలుకు 40 శాతం వరకు రాయితీ రానుంది. అగ్రికల్చర్, హార్టీకల్చర్ బీఎస్సీ చదిన వారికి 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ధర రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే.. సబ్సిడీ రూ.3.60 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ఈ ఏడాది అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ గతంలోనే చెప్పారు.నానో ఫెర్టిలైజర్స్, నానో పెస్టిసైడ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ల పాత్ర కీలకం అవనుందన్నారు. డ్రోన్లతో మోతాదుకు మించి రసాయనాల వాడకం తగ్గిపోయి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అభిప్రాయంవ్యక్తం చేశారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలో డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి.. నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలో సూచించారు. విద్యావంతులైన రైతులతో ప్రత్యేకంగా డ్రోన్ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేయాలని కూడా సీఎం చెప్పారు.