Beejapuri To Vijayawda: బీజపురి పేరు విజయవాడ ఎలా అయ్యిందో తెలుసా…అసలు విజయవాడ పేరెందుకు వచ్చిందంటే?
Beejapuri To Vijayawda: వేల సంవత్సరాల నాగరికతతో విలసిల్లిన నగరాల్లో ఒకటైన విజయవాడకు చరిత్రలో ఓ ముఖ్యమైన పేరు ఉంది. పురాణాల్లో విజయవాడ నగరం పేరు బీజపురి…బీజపురి నుంచి విజయవాడగా పేరు మారడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
Beejapuri To Vijayawda: పవిత్ర కృష్ణవేణీ పరీవాహక ప్రాంతంలోనెలకొన్న శ్రీ కనకదుర్గా క్షేత్రమే బెజవాడ. పౌరాణిక కాలంలో ఈ క్షేత్రాన్ని అనేక రకాల పేర్లతో వ్యవహరించారు. సహ్యాద్రి పర్వతాల మీద నుంచి ప్రవహిస్తూ వస్తున్న కృష్ణానది.. తనతో పాటు లోకానికి ఉపకారం చేసే అనేక ఔషధుల్ని, బీజాల్ని తన ప్రవాహంతో తీసుకువచ్చి ఈ ప్రాంతంలో వదిలేసింది. అలా కృష్ణప్రవాహం చేత తీసుకురాబడ్డ ఆ ఓషధులు బీజాలు కలిసి మొలకెత్తి ఈ ప్రదేశాన్ని సస్యశ్యామలం చేశాయి.
ఈ కారణంగా నాటి నుంచి ఈ ప్రాంతాన్ని బీజపురి, బీజవాడ, బీజవాటిక అని కూడా వ్యవహరించారు. ఆ తరువాత కృతయుగంలో దుర్గమాసురసుర, మహిషాసుర సంహారానంతరం దేవి కనక ప్రభలతో ఇక్కడి ఇంద్రకీల పర్వతం మీద వెలసిన కారణంగా కనకాఖ్యాపురీతత్రరాజతే స్వర్ణరూపిణీ.. ఇది కనకపురి అని, కనకవాడ అని కూడా ప్రసిద్ధిచెందాయి.
ద్వాపరయుగంలో, పాశుపతాస్త్రం కోసం పాండవ మధ్యముడు అర్జునుడు ఈ బీజపురిలో వున్న ఇంద్రకీలాద్రిమీద తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సాధించి, విజయాన్ని పొందిన కారణంగా ఈ క్షేత్రం విజయపురి అని విజయవాడ అని ఫల్గుణక్షేత్రమని వివిధ నామాలతో కీర్తించారు.
జయపురి (వాడ)
స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో విజయవాటికకి (వాడ) జయపురి అనే పేరు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పూర్వం మహిషాసుర సంహారానంతరం దుర్గాదేవి, లోకాల్ని పీడిస్తున్న శుంభుడు, నిశుంభుడు అనే రాక్షసుల్ని వధించి వారిపై జయాన్ని సాధించింది. ఆ విధంగా జయాన్ని పొందిన దుర్గదేవి శ్రీ కనకదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిమీద వెలిసినందువల్ల ఈ ప్రాంతం జయపురి (వాడ) అనే పేరుతోకూడా వ్యవహరించే వారు. ఈ పేరే క్రమంగా విజయవాటికగా, విజయవాడగా రూపాందరం చెందింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. అయా కాలాలను బట్టి రకరకాల పేర్లతో విజయవాడ నగరాన్ని శాసనాల్లో ప్రస్తావించారు.
ఇవి కాకుండా అమ్మవారిని కొలువైన బెజవాడను బీజవాటిక, బీజపురి, బెజ్జంవాడ, చోళరాజేంద్రపురం, అర్జునపురి, ఆంగ్లేయుల పాలనలో బ్లేజ్‌వాడగా కూడా పేర్కొన్నారు. బెజవాడ ఎండల్ని తాళలేక బ్లేజ్‌వాడగా పేర్కొన్నప్పటికీ బెజవాడ నామానికి దానికి సంబంధం లేదు.
తొమ్మిదో రోజు మహిషాసుర మర్థినిదేవీగా అమ్మవారు…
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది.
ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇదిలా ఉండగా దసరా శరన్నవరాత్రులు తుది ఘట్టానికి చేరుకున్నాయి. దశావతారాలలో ఆఖరుగా శనివారంనాడు విజయ దశమి సందర్భంగా జగన్మాత కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది.
ఉత్సవాల ముగింపు సందర్భంగా 12వ తేదీ ఉదయం అమ్మవారికి నివేదన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సాయం సంధ్యా సమయంలో గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను హంస వాహనంపై పవిత్ర కృష్ణా తీరంలో ఊరేగిస్తారు. ఈ ఏడాది కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో తెప్పోత్సవం నిర్వహణపై సందిగ్ధ నెలకొంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 40వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. వరద ప్రవాహం లేకపోతేనే ఇరిగేషన్ అధికారులు తెప్పోత్సవానికి అనుమతిస్తారు.
చరిత్రలో విజయవాడకు ఉన్న పేర్లను తెలుసుకోండి…
సంబంధిత కథనం