AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్1 రద్దుపై డివిజన్ బెంచ్‌లో ఊరట… సింగల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే
AP High Court on Group1: 2018 గ్రూప్ 1 పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ స్టే విధించింది.
AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేేస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ Division Banch స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్‌పేపర్లను మూడు సార్లు దిద్దారని, నోటిఫికేషన్‌లో లేని విధంగా డిజిటల్ మూల్యంకనం చేశారని, కోర్టు ఆదేశాలతో మరో రెండు సార్లు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేశారని, ఈ క్రమంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఈ క్రమంలో మంగళగిరిలో రెండు సార్లు మూల్యాంకనం చేసినట్టు ఆధారాలను సమర్పించడంతో మార్చి13న సింగల్ బెంచ్ 2018 గ్రూప్1 నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
పరీక్షల్లో నిర్వహణలో కమిషన్ విఫలం అయ్యిందని అభిప్రాయపడింది. లోపాల కారణంగా 2018 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై ఏపీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2018 నియామకాల్లో ఉద్యోగాల్లో చేరిన వారు విధుల్లో కొనసాగవచ్చని స్పష్టత ఇచ్చింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
మూల్యాంకనంలోనే లోపాలు…
ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఉద్యోగాలను అమ్ముకున్నారని కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, పోస్టుల్ని అమ్ముకున్నారని ఆరోపించారు. నిర్దిష్ట కారణాలు లేకుండానే గ్రూప్ 1 ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, మళ్లీ కొనసాగించారని అక్రమాలపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
మార్చి 13న సింగల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్(AP Group 1 Mains) పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. 6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి(APPSC) ఆదేశాలు ఇచ్చింది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అయితే జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి… రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని అభ్యర్థులు ఆరోపిస్తూ వచ్చారు.
ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఇరువైపు వాదన విన్న కోర్టు… ఇవాళ తీర్పును ప్రకటించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది.
స్పందించిన ఏపీ ప్రభుత్వం….
2018 గ్రూప్ -1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని… హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుందని స్పష్టంచేసింది. తాజాగా సింగల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
సంబంధిత కథనం