నరసరావు పేట ఎంపీ టిక్కెట్ ఎవరికి...?-dilemma over narasaraopet ysrcp mp candidature ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నరసరావు పేట ఎంపీ టిక్కెట్ ఎవరికి...?

నరసరావు పేట ఎంపీ టిక్కెట్ ఎవరికి...?

HT Telugu Desk HT Telugu
May 03, 2022 01:53 PM IST

వైసీపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట ఎంపీ టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌ ఎంపీని కొనసాగిస్తారా, సాగనంపుతారా అనే చర్చ జిల్లాలో బలంగా మొదలైంది.

<p>నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు</p>
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి విషయంలో వైఎస్సార్సీపీ సేఫ్‌ గేమ్‌ ఆడుతోంది. అభ్యర్ధి విషయంలో ఎవరిని నొప్పించకుండా వ్యవహరిస్తున్నా పేట నుంచి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఓడిపోయిన మోదుగుల వచ్చే ఎన్నికల్లో మళ్లీ పేటలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.

నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారనే ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్థానంలో మోదుగుల వేణుగోపాల రెడ్డి పోటీ చేస్తారని పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే మోదుగుల వేణుగోపాల రెడ్డి కూడా నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ ఉండగా మోదుగుల నియోజక వర్గంలో పర్యటించడానికి కారణం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

<p>మోదుగుల వేణుగోపాల రెడ్డి</p>
మోదుగుల వేణుగోపాల రెడ్డి

నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో కొందరు నేతలకు పడకపోవడంతో, ఘర్షణలకు దిగుతుండటంతో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పేట పార్లమెంటు స్థానం నుంచి లావు వెళ్లిపోతారని, ఆయన స్థానంలో మోదుగుల వస్తారని ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. మోదుగుల వేణుగోపాల రెడ్డి 2009లో టీడీపీ ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు అర్బన్‌ నేతలతో ఆయనకు పొసగక పోవడంతో ఆ పార్టీలో అంటిముట్టనట్లు కొనసాగారు. 2019లో గుంటూరు నగరం నుంచి వైసీపీ తరపు పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి గల్లా జయదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో విజయం తృటిలో చేజారి పోవడంతో మోదుగుల నిరాశకు గురైనా తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ నరసరావుపేటలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో నియోజక వర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో ఆయన తరచుగా కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతోనే మోదుగుల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆ మధ్య చిలకలూరి పేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజని మరిదితో లావు వర్గం ఘర్షణకు దిగింది. చిలకలూరిపేటలో పర్యటిస్తోన్న ఎంపీని విడదల రజని అడ్డుకోవడం కలకలం రేపింది. అటు వినుకొండ ఎమ్మెల్యే బొల్లతో కూడా లావుకు పడటం లేదు. వినుకొండలో తలెత్తిన వివాదంలో ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరిగడం, ఎంపీ వైఖరిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేయడంతో పార్టీ పెద్దలు నష్టనివారణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో నరసరావు పేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన మోదుగులకు నియోజక వర్గ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితిలో మార్పు రావొచ్చని భావిస్తున్నారు.2019 ఎన్నికలలో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కిలారి రోశయ్య పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు. చివర్లో గుంటూరు బరిలోకి మోదుగుల వచ్చారు. గట్టిపోటీ ఇచ్చినా సామాజిక సమీకరణల నేపథ్యంలో గల్లానే విజయం వరించింది. 2024 ఎన్నికల్లో లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు పంపి మోదుగులకు నరసరావుపేట ఖాయం చేస్తారనే వాదన కూడా లేకపోలేదు. మొత్తం మీద ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్ధుల మార్పు వ్యవహారం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner