Jagan Strategy: చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించినట్టేనా?-did jaganmohan reddy get the upper hand over chandrababu in the skill development case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Strategy: చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించినట్టేనా?

Jagan Strategy: చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించినట్టేనా?

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 08:28 AM IST

Jagan Strategy: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి మూడు వారాలు దాటి పోయింది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు బాబుకు ఎలాంటి ఊరట దక్కలేదు. మంగళవారం సుప్రీం కోర్టులోజరిగే వాదనలపైనే చంద్రబాబు గంపెడాశలు పెట్టుకున్నారు.

రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు  (ఫైల్)
రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు (ఫైల్)

Jagan Strategy: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును జైలుకు పంపి జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతానికి పైచేయి సాధించారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వానికి ఊపిరి కూడా తీసుకోనివ్వనంతగా విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశారు. దాదాపు నెలరోజులుగా టీడీపీకి చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకు రావడమే ప్రధాన కర్తవ్యంగా మారింది.

టీడీపీని నడిపించే చోదక శక్తి లేకుండా చేయాలనే జగన్ వ్యూహం పక్కాగా వర్కౌట్ అయ్యింది. చంద్రబాబు జైల్లో ఉంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీకి పరిమితం అయ్యారు. గత నెల 29నుంచి లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించాలనుకున్నా చివరి నిమిషంలో అది రద్దైంది.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన ఏపీసిఐడి నారా లోకేష్‌పై కూడా అభియోగాలు నమోదు చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్టోబర్ 3వరకు లోకేష్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు లోకేష్‌పై ఫైబర్‌ గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుల్లో కూడా సిఐడి అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసుల్లో కూడా లోకేష్‌పై అరెస్ట్ ముప్పు వెంటాడుతోంది.

చంద్రబాబును అవినీతి అభియోగాలతో అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం ద్వారా టీడీపీ ఇన్నాళ్లు నమ్ముకున్న అవినీతి ఆరోపణలు, ప్రచారాలకు జగన్ చెక్‌ పెట్టేశారు. జగన్‌ను జైలుకెళ్లాడంటూ ప్రత్యర్థులు విమర్శించే అవకాశం లేకుండా చేశారు.

టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం…

చంద్రబాబు అరెస్ట్‌‌కు ముందు వరకు టీడీపీలో ఎన్నికలపై పూర్తి భరోసా ఉండేది. రానున్న ఎన్నికల్లో అధికార పక్షానికి గట్టి పోటీ ఇస్తామనే నమ్మకం ఉండేది. ఇప్పుడు టీడీపీని ముందుండి నడిపించే నాయకత్వం కూడా కరువైంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరాలనుకున్న ఇతర పార్టీల నాయకులు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి లోకేష్‌ ఢిల్లీకే పరిమితం అయ్యారు. సిఐడి విచారణకు హాజరు కావాలని గత వారం సిఐడి నోటీసులు కూడా ఇవ్వడంతో ఈ కేసుల జంజాటం ఇప్పట్లో టీడీపీని వీడకపోవచ్చని స్పష్టమై పోయింది.

మంగళవారం సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఊరట దక్కినా ఇతర కేసులు టీడీపీని చికాకు పెడుతూనే ఉంటాయి. చంద్రబాబుకు కేసుల నుంచి విముక్తి లభిస్తే ఆ వెంటనే లోకేష్‌పై పట్టు బిగించే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు మళ్లీ టీడీపీకి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు లేదా లోకేష్‌లను కట్టడి చేస్తే టీడీపీని ముందుండి నడిపించే వారుండరు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం ఎవరికి లేదు. పార్టీలో ఏపీ అధ్యక్షుడిగా అచ్చన్నాయుడు ఉన్నా పార్టీ వ్యవహారాలు, ఆర్ధిక లావాదేవీలు మొత్తం బాబు కనుసన్నల్లోనే జరుగుతాయి. ప్రాంతీయ పార్టీల్లో కనిపించే వ్యక్తిస్వామ్యం టీడీపీలో కాస్త ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు చుట్టూనే ఆ పార్టీ కార్యక్రమాలు సాగుతుంటాయి.ఇప్పుడు బాబు జైల్లో ఉండటంతో ఆ పార్టీ కీలక నాయకుల్లో కూడా జంకు మొదలైంది. ముఖ్యమైన నాయకులు ఎవరు ధైర్యంగా బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ధర్నాలు, నిరసనలు వంటి కార్యక్రమాలను పోలీసులు అణిచివేస్తుండటం కూడా క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. ఈ పరిస్థితి ఎంత కాలం ఉంటుందో కూడా వారికి అర్థం కావడం లేదు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన ప్రకటించినా, దానిని ఎలా పరిగణించాలో చాలా మంది టీడీపీ నాయకులు అర్థం కావటం లేదు. చంద్రబాబు బయటకు వస్తే తప్ప ఈ పొత్తుల చిక్కుముడి వీడే అవకాశం లేకపోవడంతో ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. సంస్థాగతంగా జనసేనతో పోలిస్తే టీడీపీకి ఎక్కువ బలం ఉన్నా, ఇప్పుడు జనసేన నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి టీడీపీకి రావడం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Whats_app_banner