Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వివాదం, అప్పటి వరకూ నీటి విడుదల ఆపాలని ఏపీకి కేంద్ర జలశక్తి శాఖ సూచన
Nagarjuna Sagar Project Issue : నాగార్జున సాగర్ జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ సంయమనం పాటించాలని కేంద్ర జలశక్తి శాఖ కోరారు. ఈ నెల 6న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించి, వివాదాన్ని పరిష్కరిస్తామని తెలిపింది.
Nagarjuna Sagar Project Issue : కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6న కేంద్ర జలశక్తి శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించనుంది.
సంయమనం పాటించండి
ఈ అంశాలపై శనివారం దిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో సమావేశం నిర్వహించారు. అయితే తెలంగాణ సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. అయితే ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర జలశక్తి అధికారులు తెలిపారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.
అప్పటి వరకూ నీటి విడుదల ఆపండి
అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్ కు సూచించారు. అప్పటి వరకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కావున ఈనెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని ఆమె పునరుద్ఘాటించారు.
ఈ నెల 6న సమావేశం
విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో సమావేశంలో ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరించడం, రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ నెల 6న జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకువస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలోకి
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కు అప్పగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులను సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ భద్రత పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో సీఆర్‌పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ పైకి చేరుకున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటున్నాయి. ఏపీ పోలీసులు 13వ గేటు వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నాలుగు వేల క్యూసెక్కుల నీరు విడుదల కొనసాగుతోంది.