Jobs For Covid Deaths: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కోవిడ్ మృతుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు..
Jobs For Covid Deaths: కోవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు కల్పించడానికి లైన్ క్లియర్ అయ్యింది. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అనుమతిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Jobs For Covid Deaths: కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్పొరేషన్ ఉద్యోగులు, యూనివర్శిటీల ఉద్యోగుల వారసులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్‌తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2020 నుంచి కోవిడ్‌తో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 1,488 కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించారు. మరో 1,149 దరఖాస్తుదారులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆగస్టు 17 లోగా దరఖాస్తుల పరిశీలించి 24లోగా నియామక ఉత్తర్వులు అంద చేయాలని ఆదేశించారు. అయా శాఖలు జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీచేశారు.
కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీచేసింది. 2020, 2021 కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యుల్లో ఇప్పటి వరకు 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,488 మందికి ఉద్యోగాలిచ్చారు. మరో 1,149 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ఆగస్టు 24 కల్లా నియామక ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది.
అర్హులైన వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయాల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు.
కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాల్సిఉంది. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. వారి నుంచి సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలని నిబందనల్లో పేర్కొన్నారు.