CM Jagan Review On Floods : ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వండి.. కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు-cm ys jagan review meeting on heavy rains and floods in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review On Floods : ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వండి.. కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review On Floods : ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వండి.. కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 28, 2023 04:18 PM IST

రాష్ట్రంలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాసం కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

Heavy Rains And Floods n AP: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. శుక్రవారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సమీక్షించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని... ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశించారు.

వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు. అవసరం అనుకుంటే… పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలనుకూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి” అని సీఎం ఆదేశించారు.

కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దని స్పష్టం చేశారు సీఎం జగన్. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరమన్నారు. అలాంటి వారికి రూ.10వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. "అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లును కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీచేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీచేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్‌, కేజీ కందిపప్పు ఇవ్వాలి. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. కంట్రోలు రూమ్స్‌ ఏర్పాటు చేయడం. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోండి. ముంపు బాధిత గ్రామాలమీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి" అని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటివాటిని సిద్ధంచేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ప్యాకెట్లను సిద్ధంచేసుకోవటంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలన్నారు. అలాగే ఆరోగ్య శిబిరాల ఏర్పాటుతో పాటు విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

IPL_Entry_Point