Housing For Poor: అమరావతిలో జులై 8న ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్న వైఎస్ జగన్-cm jagan will start construction of houses in r5 zone on the occasion of ysr jayanti on july 8 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Housing For Poor: అమరావతిలో జులై 8న ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్న వైఎస్ జగన్

Housing For Poor: అమరావతిలో జులై 8న ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్న వైఎస్ జగన్

HT Telugu Desk HT Telugu
May 26, 2023 12:14 PM IST

Housing For Poor: అమరావతిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో 50వేల మందికి సిఎం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Housing For Poor: దేశంలో, రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజా ఉద్యమాలు జరిగితే, అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వొద్దని పెత్తందారులు ఉద్యమించారని సిఎం జగన్ ఆరోపించారు.

రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే అమరావతిలో ఇళ‌్ళ స్థలాల పంపిణీకి ప్రత్యేకత ఉందని జగన్ చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జరిగిన వందల, వేల పోరాటాలు జరిగాయని, 75ఏళ్ల స్వాతంత్య్రంలో ఎన్నో పోరాటాలు ఇంటి స్థలాల కోసం జరిగాయని, ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడటం మాత్రం ఎక్కడా జరగలేదన్నారు.

50వేల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇస్తున్న పండగకు,చారిత్రక ఘట్టం మాత్రం అమరావతిలోనే చూస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయ పడితే, దానినిఅడ్డుకోడానికి సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి అడ్డుపడితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని తాపత్రయ పడిన ప్రభుత్వం దేశంలో మరెక్కడ లేదన్నారు.

50,793మంది మహిళలకు వారిపేర్ల మీదఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి బహుకరించే అవకాశం తనకు ఇచ్చినందుకు భగవంతుడికి రుణపడి ఉంటానని సిఎం జగన్ చెప్పారు. కార్యక్రమం ప్రారంభంలో ఈ ప్రాంతంలో గజం ఎంత ఉంటుందని స్థానిక నేతల్ని అడిగితే, ఇటీవల జరిగిన వేలంలో గజం రూ.17వేల ధర పలికిందని, కనీసం రూ.15-20వేల ధర పలుకుతుందని చెప్పారన్నారు. సగటున ఒక్కో లబ్దిదారుడికి రూ.7 నుంచి పది లక్షల ఖరీదు చేసే ఇంటి స్థలం మహిళల పేరిట రిజిస్టర్ చేస్తున్నట్లు తెలిపారు.

అమరావతి ఇకపై సామాజిక అమరావతి…

పేదలకు తాను ఇస్తున్నవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదని, సామాజిక న్యాయ పత్రాలని, అమరావతిలో ఇకపై సామాజిక అమరావతి అవుతుందని, అమరావతి ఇకపై అందరి అమరావతి అవుతుందని సిఎం ప్రకటించారు.

మంగళగిరి,తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1400ఎకరాల్లో 50,793మందికి ఇళ్ల స్థలాలను అందచేస్తున్నట్లు చెప్పారు. 25 లే ఔట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, నేటి నుంచి వారం రోజుల పాటు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

జులై 8 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం…

ప్రతి లేఔట్ వద్దకు లబ్దిదారులకు తీసుకెళ్లి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇంటి స్థలం వద్ద ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి, ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి లబ్దిదారుడికి ఇంటి పత్రాలు ఇచ్చి ధృవీకరణ చేసి జియో ట్యాగింగ్ పూర్తి చేసి,జులై8వ తేదీన వైఎస్సార్ జయంతి రోజు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.

ఇళ్ల పట్టాలు ఇస్తున్న ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేశారని, సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమం పూర్తి చేశామని, 233కి.మీ అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణాన్నిపూర్తి చేశామని చెప్పారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతోందని, జులై 8 నుంచి ఇళ్ల నిర్మాణం మొదలు పెడుతున్నట్లు చెప్పారు.

ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు…

లబ్దిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తామని, సొంతంగా కట్టుకుంటామంటే పనుల పురోగతి మేరకు రూ.1.80లక్షలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, రెండో ఆప్షన్లో ఎవరైనా ఇంటి నిర్మాణాన్ని అందచేయాలని కోరితే,మెటిరియల్‌ అవసరమైన సామాగ్రిని పనుల పురోగతి మేరకు అందచేస్తామన్నారు.మూడో ఆప్షన్‌లో ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరినా దానికి కూడా ప్రభుత్వం సిద్దమేనని చెప్పారు. మూడో ఆప్షన్ ఎంచుకున్న వారికి ప్రభుత్వం తోడుగా ఉండి,వారికిఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే మూడు ఆప్షన్లలో దేనిని ఎంచుకున్నా వారికి ఇసుక ఉచితంగా అందిస్తామని చెప్పారు. సిమెంట్, స్టీల్, డోర్ ఫ్రేములు, ఇతర మెటిరియల్‌ ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందచేస్తుందని చెప్పారు. మార్కెట్‌లో కొనుగోలు చేసే ధర కంటే తక్కువ ధరలకే ప్రభుత్వం సప్లై చేస్తుందని చెప్పారు. ప్రతి మహిళకు రూ.35వేల రుపాయల రుణం ఇప్పిస్తామని, పావలా వడ్డీకే రుణాలు వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల్లో 30లక్షల 75వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని వాటిలో 21లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు.

30.75లక్షల ఇంటి స్థలాల్లో రెండున్నర లక్షలరుపాయల విలువ చేసే నిర్మాణం చేపడుతున్నామన్నారు. కనీసం రూ.5లక్షల విలువ లెక్కించినా రూ.2-3లక్షల విలువైన ఆస్తిని పేదల కుటుంబాలకు కేటాయిస్తున్నట్లు సిఎం చెప్పారు. రాష్ట్రంలో మహిళల పేరిట ఇళ్ల స్థలాల కోసమే రెండు, మూడు లక్షల కోట్ల రుపాయల ఆస్తిని కట్టబెడుతున్నట్లు చెప్పారు.

వైఎస్సార్ జయంతి రోజు అమరావతి ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని, 50వేల కుటుంబాలు నివసించే ప్రతి కాలనీలో ప్రైమరీ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్ వాడీ, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.