E Autos Distribution: చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన సిఎం జగన్
E Autos Distribution: ఏపీలో పారిశుధ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మునిసిపాలిటీల్లో ఇంటింటి చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 36మునిసిపాలిటీలకు ఈ ఆటోలను ముఖ్యమంత్రి పంపిణీచేశారు.
E Autos Distribution: ఏపీలో పారిశుధ్య సేవల్ని మరింత మెరుగు పరిచి రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనే సంకల్పంతో పర్యావరణ హితంగా ఉండే ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్నయించింది. చిన్న మున్సిపాలిటీలకు వాహనాల నిర్వహణ భారం తగ్గేలా ఈ– ఆటోలను పంపిణీ చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ.4.10 లక్షల విలువ చేసే 516 ఈ – ఆటోల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ఎలక్ట్రిక్ ఆటోలను సిఎం ప్రారంభించారు.
మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ "ఈ- ఆటోల" డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్ల వ్యయంతో 123 మున్సిపాలిటీలోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్తబుట్టల పంపిణీ చేసినట్లు మునిసిపల్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
గ్రేడ్-1 మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్భేజ్ టిప్పర్ల వినియోగిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభించారు. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ. 157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గారేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు మునిసిపల్ శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల్ని అమలు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టూ కంపోస్ట్ ప్లాంటులతో పాటు 4 బయో మిధనేషన్ ప్రాజెక్ట్ లు అమలు చేస్తున్నారు. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.