Ys Jagan on CBN: బాబు పేరు చెబితే మోసాలు, పవన్ పేరు చెబితే పెళ్లిళ్లు మాత్రమే గుర్తుకు వస్తాయన్న సిఎం జగన్
Ys Jagan on CBN: చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలు, వెన్నుపోట్లు, పవన్ కళ్యాణ పేరు చెబితే పెళ్లిళ్లు తప్ప మరొకటి గుర్తుకు రావని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ‌్‌పై తీవ్ర విమర‌్శలు చేశారు.
Ys Jagan on CBN: చంద్రబాబు, దత్తపుత్రుడు పేరు చెబితే ప్రజలకు చేసిన మంచి ఏమి గుర్తుకు రాదని, చంద్రబాబు పేరు చెప్పగానే మూడుసార్లు సిఎంగా పనిచేసినా మహిళలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకు వస్తాయని సిఎం జగన్ ఎద్దేవా చేశారు.
దత్తపుత్రుడు Pawankalyan పేరు చెబితే వివాహ వ్యవస్థకు కళంకం..ఓ మాయని మచ్చలా, కార్లు మార్చినట్టు భార్యల్ని మార్చే విలువలు లేని దత్తపుత్రుడు మాత్రమే గుర్తుకు వస్తాడన్నారు.
2014లో TDP Janasena కలిసి పోటీ చేసి ఏటా 12 సిలిండర్లకు ఏటా రూ.1200, ఐదేళ్లలో ఆరు వేలు ఇస్తామన్నారని, మహిళల రక్షణ కోసం ఉమన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారని, ఆడబిడ్డ పుట్టగానే రూ.25వేల బ్యాంక్ డిపాజిట్ చేస్తామని మహాలక్ష్మీ పథకం చెప్పారని, పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీలకు రూ.10వేల చెల్లిస్తామన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. అనకాపల్లిలో మహిళలకు చేయూత నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు.
మహిళల స్వావలంబనకు చేయూత…
అంతర్జాతీయ మహిళ దినోత్సవం ముందు రోజు మహిళల ఆర్ధిక స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ అడుగులు వేస్తున్నట్టు సిఎం జగన్ చెప్పారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేశారు.
దేశ చరిత్రలో, 28రాష్ట్రాల్లో మహిళా సాధికారత కోసం ఇంత చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతున్నామన్నారు. 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో నగదు పంపిణీ చేస్తామన్నారు.
మహిళలకు జరిగిన మంచి,వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయనే వివరాలు ప్రతి ఒక్కరి మధ్య చర్చకు రావాల్సి ఉందన్నారు. తమకు జరిగిన మేలు గురించి ప్రతి మహిళ మాట్లాడాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదని, 45ఏళ్లకు పైబడిన మహిళలు ఎలా బతుకుతున్నారని ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని జగన్ ఆరోపించారు.
మహిళలకు 50శాతం పదవులు ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు ఎందుకు రాలేదన్నారు. చదివించే తల్లులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడు అమలు కాలేదన్నారు. పిల్లల్ని బడికి పంపితే చాలని, ప్రోత్సహకంగా అమ్మఒడి పథకాన్ని అందించామని చెప్పారు.
53లక్షల మంది తల్లులకు ఏటా రూ.15వేల ప్రోత్సహకం అందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేదని, ఇలాంటి మార్పును ఎప్పుడూ చూడలేదన్నారు. పిల్లల చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని చెప్పారు.
చంద్రబాబు సెంటు భూమి ఒక్కరికైనా ఇచ్చాడా అని జగన్ ప్రశ్నించాడు. చంద్రబాబు ఇచ్చింది సున్నా, కట్టింది అరకొర ఇళ్లేనని జగన్ ఎద్దేవా చేశారు. మహిళల భద్రత కోసం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసును నియమించినట్టు చెప్పారు.
ఇద్దరు కలిసి 2014లో సంతకాలు చేసిన మ్యానిఫెస్టో ఏమైందన్నారు. మహిళల విషయంలో ఏమి వాగ్దానం ఇచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎవరు మంచి చేశారో గుర్తు చేసుకుని, 58 నెలల్లో మంచి జరిగితే తన వెంట నిలవాలని కోరారు. దేవుడి దయతో పాటు చల్లని ఆశీస్సులు ఉండాలని కోరారు. అనకాపల్లిలో భరత్‌ను ఆశీర్వదించాలని, భవిష్యత్తులో మంత్రి గుడివాడ అమర్‌కు మంచి జరుగుతుందని సిఎం జగన్ చెప్పారు.