Ambedkar Statue In Vijayawada : అంబేడ్కర్ స్మృతివనం.. అత్యంత సుందరంగా ఉండాలి.. సీఎం జగన్-cm jagan reviews on ambedkar statue construction in vijayawada orders officials to complete works soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambedkar Statue In Vijayawada : అంబేడ్కర్ స్మృతివనం.. అత్యంత సుందరంగా ఉండాలి.. సీఎం జగన్

Ambedkar Statue In Vijayawada : అంబేడ్కర్ స్మృతివనం.. అత్యంత సుందరంగా ఉండాలి.. సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 03:25 PM IST

Ambedkar Statue In Vijayawada : విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తోన్న అంబేడ్కర్ స్మృతివనం అత్యంత సుందరంగా ఉండాలని.. ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.

అంబేడ్కర్ స్మృతి వనం
అంబేడ్కర్ స్మృతి వనం

Ambedkar Statue In Vijayawada : విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులని ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని.. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అంబేడ్కర్ విగ్రహం పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కి వివరించారు. పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందని... ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని తెలిపారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్న అధికారులు... మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని వివరించారు. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలించామని పేర్కొన్నారు.

అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టుని రూ.268 వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 2 వేల మంది కూర్చునేలా కన్వెన్షన్‌ సెంటర్‌నూ నిర్మిస్తోంది. కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్ల సుందరీకరణపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు... ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షలో అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా... అధికారులకు పలు కీలక సూచనలు చేసిన సీఎం... నిర్దేశిత సమయంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టుని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ స్మృతివనాన్ని విజయవాడలోని స్వరాజ్‌మైదానంలో నిర్మిస్తామని 2020లో వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే శంకుస్థాపన కూడా చేశారు. ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ‌్యమంత్రి ప్రకటించారు. కోవిడ్‌ కారణంగా నిర్మాణంలో పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరిన వెంటనే.. పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం.... వీలైనంత త్వరగా ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది.

Whats_app_banner