CM Jagan Review: వేసవిలో విద్యుత్ కొరత ఉండొద్దు... సీఎం జగన్ ఆదేశాలు
cm jagan on energy department: వేసవిలో కరెంట్ కోత అనేది ఉండొదన్నారు సీఎం జగన్. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై కీలక సూచనలు చేశారు.
cm jagan review on energy department: విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం... పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వేసవిలో విద్యుత్ కొరత అనేది ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కావొద్దని చెప్పారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
వేసవి దృష్ట్యా.... థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని.. ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. బొగ్గు నిల్వల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్లపై కూడా ముఖ్యంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని... అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచే విషయంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. సబ్ స్టేషన్ల నిర్మాణాలపై కూడా దృష్టిపెట్టామని... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్లు వివరించారు. మార్చి నెలాఖరు నాటికి వీటి నిర్మాణాలను పూర్తిచేస్తామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కరెంట్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని... ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యే కొద్ది...కొత్త కనెక్షన్లు ఇస్తామని తెలిపారు.