CM Jagan Distributes Funds: లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 590 కోట్లు జమ చేసిన సీఎం జగన్
CM Jagan Distributes Funds: నవరత్నాల ద్వైవార్షిక నగదు మంజూరులో భాగంగా.. సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 590 కోట్లు జమ చేశారు. పింఛన్ల పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని కలెక్టర్లకు సూచించారు.
CM Jagan Distributes Funds: CM Jagan Distributes Funds: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి, అవకతవకలకు తావు లేకుండా... పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా.. 2,79,065 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ. 590.91 కోట్లను సీఎం వైఎస్ జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 36 నెలల కాలంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ. 1.85 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. ఇతర పథకాలతో కలిపి ఇప్పటి వరకు అందించిన మొత్తం.. రూ. 3.30 లక్షల కోట్లని వెల్లడించారు. ఈ స్థాయిలో నేరుగా ప్రజలకు మేలు చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు.
"గత ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు పథకాలు ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచించాయి. తమ పార్టీ వారికే సంక్షేమ పథకాలు అమలు చేశాయి. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. వారి హయాంలో లంచాలు, అవినీతి ఎక్కువ జరిగింది. ఇందుకు పూర్తి భిన్నంగా మేం వ్యవహరిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. ఏ పేదవాడికీ అన్యాయం జరగొద్దని.. పేదలందరికీ న్యాయం జరగాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తుంటే.. పింఛన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి" అని సీఎం జగన్ అన్నారు.
పింఛన్లకు కోత విధిస్తున్నారన్న విపక్షాల ఆరోపణలపై స్పందించిన సీఎం జగన్.. అర్హులకే మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొంత మంది పింఛన్ దారులకు నోటీసులు పంపిందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పథకానికి సంబంధించి ఆడిట్ జరగాల్సి ఉందని.. ఇందులో భాగంగా అనర్హులను గుర్తించే కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. డాటా విశ్లేషణ తర్వాత అనుమానం వచ్చిన వారికి అధికారులు నోటీసులు పంపుతారని.. ఆ నోటీసులపై వచ్చిన వివరణ పరిశీలించి... వారు అర్హులా, కాదా అన్న విషయాన్ని అధికారులు తేలుస్తారని వివరించారు. పింఛన్లు పొందేందుకు వారికి పూర్తి అర్హత ఉంటే... పంపిణీ కొనసాగుతుందని .. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
అర్హులందరికీ పింఛన్లు అందాలన్నదే మా లక్ష్యమని.... ఇందుకు అనుగుణంగానే ముందుకెళుతున్నామని... ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను కలెక్టర్లు తిప్పికొట్టాలని జగన్ సూచించారు. గత ప్రభుత్వం 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. తమ ప్రభుత్వం 62 లక్షల 70 వేల మందికి అందిస్తోందని వివరించారు. పింఛన్ సొమ్ము కూడా భారీగా పెంచామని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే అడ్డగోలు రాజకీయ విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.