Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం, ఇలా కొనొచ్చు-clothes donated by devotees to tirumala srivari temple and other affiliated temples will be auctioned from april 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం, ఇలా కొనొచ్చు

Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం, ఇలా కొనొచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 10, 2024 07:12 AM IST

Tirumala Srivari Temple Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD).భక్తులు స్వామివారికి కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 15 నుంచి ఈ – వేలం వేయనున్నట్లు ప్రకటించింది.

తిరుమల తిరుపతి
తిరుమల తిరుపతి

Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ- వేలానికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 15 నుంచి వేలం(Tirumala srivari clothes auction) వేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 335 (23541 నుంచి 23552) లాట్లు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ లాట్లలో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, దుప‌ట్టాలు, శాలువ‌లు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్‌, హ్యాండ్ క‌ర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళాలు, కార్పెట్లు ఉన్నాయని టీటీడీ పేర్కొంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. 0877-2264429 నంబర్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవటం లేదా… టీటీడీ వెబ్‌సైట్‌ ( www.tirumala.org / www.konugolu.ap.govt.in) సంప్రదించవచ్చని సూచించింది.

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు (Vasanthotsavam) అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ (TTD)రద్దు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం