TTD Panchangam Books 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్... టీటీడీ పంచాగం పుస్తకాలు వచ్చేశాయ్..! ఇలా కొనొచ్చు
TTD Krodhinama Panchangam 2024 : భక్తులకు శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని అందుబాటులో ఉంచింది టీటీడీ. తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ పుస్తక కేంద్రాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.
TTD Krodhinama Panchangam 2024 : భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు మంగళవారం టీడీడీ (TTD) ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాగాన్ని(Krodhinama Panchangam 2024) టీటీడీ ముద్రించింది. మార్చి 27వ తేదీ నుంచి తిరుమలతో పాటు తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. రూ.75 చెల్లించి భక్తులు వీటిని పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.
- ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్థంతి
- ఏప్రిల్ 7న మాసశివరాత్రి.
- ఏప్రిల్ 8న సర్వ అమావాస్య.
- ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
- ఏప్రిల్ 11న మత్స్యజయంతి.
- ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఆస్థానం.
- ఏప్రిల్ 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం.
- ఏప్రిల్ 19న సర్వ ఏకాదశి.
- ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం…..
Koil Alwar Tirumanjanam: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Tirumanjanam) నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 3న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.