సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై విచారణ జరపాలి: సీఐటీయూ-citu demands inquiry into cement factory blast incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై విచారణ జరపాలి: సీఐటీయూ

సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై విచారణ జరపాలి: సీఐటీయూ

HT Telugu Desk HT Telugu
Jul 08, 2024 09:36 AM IST

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనపై విచారణ జరపాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

ఫ్యాక్టరీలో పేలుడు (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్యాక్టరీలో పేలుడు (ప్రతీకాత్మక చిత్రం)

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.‌ ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మృతులకు పరిహారం అందేటట్లు చూడాలని ఆదేశించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ జి.సృజన పరామర్శించారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.‌ ఘటనపై విచారణ జరిపించాలని సీయూటీయూ డిమాండ్ చేసింది.

జగ్గయ్యపేట మండలం బోదవాడలోని‌ ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన అల్ట్రాటెక్ బాలజీ సిమెంట్ ఫ్యాక్టరీలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని కార్మికులు చెబుతున్నారు. ఫ్రీ హీటర్ నిర్వహణ లోపం కారణంగా బాయిలర్ పేలి ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు.

ఈ బాయిలర్ లో 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో క్లింకర్, కిలన్ సరఫరా అవుతుంది.‌ ఈ బాయిలర్‌కు దగ్గరగా పని చేస్తున్న కార్మికులపై మెటీరియల్ ఒక్కసారిగా పడింది. దీంతో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు.

మణిపాల్ హాస్పిటల్ కి తరలించిన బూదవాడ గ్రామానికి చెందిన పరిటాల అర్జునరావు (38), ఆవుల వెంకటేష్ (37) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు.‌ అయితే ఇదే హాస్పిటల్ లో ఉన్న మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.‌‌ బూదవాడ గ్రామానికి చెందిన గుగులోతూ బాలాజీ, బాణావత్ స్వామి, ధారావత్ వెంకటేశ్వర్లు, వేముల సైదులు, బాణావతి సైదా, గుగులోతు గోపి నాయక్ లు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన‌ నాగేంద్ర సూరజ్ సింగ్, వివేక్ సింగ్, శుభ్రం సోని, దినేష్ కేశ్ లాష్, అరవింద్ యాదవ్, గుడ్డు కుమార్, రవి కుమార్ విశ్వకర్మ తదితరులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన తరువాత బూదవాడ గ్రామానికి చెందిన‌ గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఫ్యాక్టరీ పరిపాలన బ్లాక్ ను ముట్టడించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ వారిని కోల్పోయామని, మరికొంత మందికి‌ గాయాలు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీకి భద్రత కల్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పించామని ఏసీపీ రవి కిరణ్ తెలిపారు.

ఇదీ కారణం?

కంపెనీలో సిమెంట్ తయారు చేసే క్రమంలో లైమ్ స్టోన్, రెడ్ సాయిల్, ఐరన్ ఓర్ మిశ్రమాన్ని పైప్ ద్వారా సరఫరా చేస్తారు. ఈ మిశ్రమం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది. అయితే పైప్‌లైన్ లీక్ అవుతుందని, దాన్ని రిపేర్ చేయాలని కార్మికులు యూనిట్ హెడ్ దృష్టికి గత రెండు‌ నెలలుగా అనేక సార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా పైప్‌లైన్ మార్చకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగాయని, వాటిని బయటకు రాకుండా యాజమాన్యం కప్పిపుచ్చిందని కార్మికులు చెబుతున్నారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించండి: సీఎం

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‌అలాగే కంపెనీ నుండి బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని, ప్రభుత్వం కూడా సహాయం ‌అందిస్తుందని హామీ ఇచ్చారు. నందిగామ అర్డీఓ రవీంద్రరావు ఈ ఫ్యాక్టరీని పరిశీలించారు. అలాగే మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను జగ్గయ్యపేట నుండి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కలెక్టర్ జీ.సృజన పరామర్శించారు.

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.‌ మణిపాల్, ఆంధ్రా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న కార్మికులను సీహెచ్ నర్సింగరావు, సీఐటీయూ కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఏ.వెంకటేశ్వరరావు, జిల్లా నాయకుడు డీవీ కృష్ణ పరామర్శించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరణించిన కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, గాయపడిన కార్మికులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.

- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel